
తగిన జాగ్రత్తలతోనే పంటల రక్షణ
వైరా/కొణిజర్ల: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చేన్లలో నీరు నిలిచి పంటలు దెబ్బతినే అవకాశం ఉన్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. వైరా మున్సిపాలిటీ పరిధి సోమవరం నల్లచెరువు వరదతో నీట మునిగిన పంట పొలాలను గురువారం ఆయన పరిశీలించారు. నష్టం జరిగితే రైతులు తక్షణమే అధికారులకు తెలియజేయాలన్నారు. ఆతర్వాత డిజిటల్ క్రాప్ సర్వేను క్షేత్ర స్థాయిలో డీఏఓ పరిశీలించారు. అంతేకాక కొణిజర్ల మండలం కొణిజర్ల – మల్లుపల్లి మధ్య పొంగిపొర్లుతున్న పగిడేరు ఉధృతిని పరిశీలించిన డీఏఓ, కొణిజర్లలో పెసర చేన్లను పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీ, ఏఓలు మయాన్ మంజుఖాన్, బాలాజీ, ఏఈఓలు శ్రీనివాసరాజు, రాజేశ్ పాల్గొన్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఖమ్మంవ్యవసాయం: భారీ వర్షాల నేపథ్యాన పంటల్లో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డీఏఓ డి.పుల్లయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. మరికొద్దిరోజులు వర్ష సూచన ఉన్నందున ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేయొద్దని తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణంలో విద్యుత్ స్తంభాలు, తీగలు, చెరువులకు దూరంగా ఉండాలని, చెట్ల కింద నిలబడొద్దని చెప్పారు. ప్రస్తుతం వరి దుబ్బు దశ నుంచి కంకి దశకు చేరుతున్నందున పైరులో నీరు నిల్వ ఉండకుండా చూస్తూ మొక్కకు గాలి తగిలే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, పత్తి పైర్లు తేమ బారిన పడితే బూడిద తెగులు వచ్చే అవకాశమున్నందున వర్షాలు తగ్గాక 3 గ్రాముల సల్ఫర్‌ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. వేరుకుళ్లు తెగులు నివారణకు కాపరాక్సీ క్లోరైడ్ 3 గ్రాములను లీటర్ నీటిలో కలిపి మొక్కల మొదళ్లు తడిచేలా చుట్టూ నేలపై పోయాలని చెప్పారు. వర్షం తగ్గాక పైరు కోలుకోవడానికి 13:0:45 ఎరువును 5–10 గ్రాములు లేదా 10 గ్రాముల యూరియాను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. ఇక మొక్కజొన్న అధిక వర్షాలతో భాస్వరం లోపానికి గురైతే ఆకులు ఊదారంగులోకి మారతాయని చెప్పారు. దీని నివారణకు వర్షాలు తగ్గాక 5 గ్రాముల 19:19:19 లేదా 20 గ్రాముల డీఏపీని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని డీఏఓ సూచించారు.