
వర్షంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
రోజుకు లక్ష టన్నుల ఉత్పత్తికి ఆటంకం
సింగరేణి(కొత్తగూడెం)/సత్తుపల్లి రూరల్: మూడు రోజులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా సింగరేణి వ్యాప్తంగా రోజుకు లక్ష టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రోజూ 1.94లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగాల్సి ఉండగా, కేవలం 94వేల టన్నులకే పరిమితమవుతోంది. తద్వారా మూడు రోజుల్లో 3లక్షల టన్నుల ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. అలాగే, సంస్థ వ్యాప్తంగా ఓవర్ బర్డెన్ తొలగింపు కూడా నిలిచిపోయింది. ఓసీల్లో క్వారీల్లో నిలిచిన వర్షపు నీటిని ప్లాన్‌టూన్ పంపుల ద్వారా బయటకు పంపిస్తున్నారు. కాగా, సత్తుపల్లి జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీల్లో బొగ్గు ఉత్పత్తి, ఓవర్ బర్డెన్ తొలగింపు పనులు నిలిచిపోగా, ఓసీల్లో చేరిన నీటిని మోటార్ల సాయంతో బయటకు పంపిస్తున్నామని పీఓలు ప్రహ్లాద్, నర్సింహారావు తెలిపారు.