
ఐటీఐతో ఉపాధి అవకాశాలు
మెరుగైన ఉపాధి అవకాశాలు
● విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా మార్పులు ● సకల సౌకర్యాలతో సిద్ధమైన ఖమ్మం ఏటీసీ ● ఈనెల 28వరకు ప్రవేశాలకు కౌన్సెలింగ్
ఖమ్మం సహకారనగర్: ఐటీఐ కోర్సులతో ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయనే విశ్వాసాన్ని విద్యార్థుల్లో కల్పించేలా ప్రభుత్వం, అధికారులు, ఐటీఐ కళాశాల బాధ్యులు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో 65 ప్రభుత్వ ఐటీఐ కళాశాలలుండగా... గత ఏడాది వీటిని అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లు (ఏటీసీ)గా మార్పు చేయాలని నిర్ణయించారు. తొలి దశలో రాష్ట్రంలోని మూడు కళాశాలలను మోడల్ ఏటీసీగా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. ఈ జాబితాలో ఖమ్మంలోని టేకులపల్లిలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఉంది. ఇక నూతనంగా ప్రభుత్వం తెలంగాణ గేట్ ఫర్ అడాప్టింగ్ అండ్ ట్రైనింగ్ ఎంప్లాయ్‌మెంట్ (టీ–గేట్) విధానాన్ని ప్రవేశపెట్టింది. టీ–గేట్‌తో ఐటీఐ (ఏటీసీ)లో ప్రాంగణ నియామకాలు పెంచి విద్యార్థులకు ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా కృషి చేయనున్నారు.
టీ–గేట్‌తో ఉపాధి..
ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ–గేట్‌తో ఐటీఐ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెండుగా లభించనున్నాయి. తెలంగాణ గేట్ ఫర్ అడాప్టింగ్ అండ్ ట్రైనింగ్ ఎంప్లాయ్‌మెంట్ (టీ–గేట్) పథకం ద్వారా జిల్లాలోని పరిశ్రమల్లో విద్యార్థులకు ఉద్యోగ కల్పన చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రధాన పరి శ్రమ లేదా సంస్థ డైరెక్టర్, సీఎండీ స్థాయి అధికారి కమిటీ చైర్మన్‌గా, కార్మిక విభాగం అధికారి వైస్ చైర్మన్‌గా, ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ కన్వీ నర్‌గా ఉంటారు. ఈ కమిటీ జిల్లాలోని పరిశ్రమల్లో ఉన్న ఖాళీలను గుర్తించి.. ఐటీఐ విద్యార్థులతో భర్తీ చేసేలా ప్రణాళిక రూపొందిస్తుంది. దీనిద్వారా పరి శ్రమల్లో ఖాళీలు భర్తీ కావడంతోపాటు విద్యార్థులకు ఉద్యోగాలు దక్కుతాయి. అలాగే పరిశ్రమల్లో ఖాళీలు భర్తీ చేసినందుకు గాను ఆయా పరిశ్రమలు సీఎస్‌ఆర్ పథకం కింద ఐటీఐ కళాశాలలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తాయి. అలాగే పరిశ్రమల్లో అవసరమైన అర్హతలు కలిగిన ఉద్యోగి ఐటీఐల్లో లేకపోతే.. అలాంటి విభాగాల్లో ప్రత్యేకంగా ఐటీఐలో శిక్షణ అందించి ఆయా ఖాళీలను భర్తీ చేసే బాధ్యతను ఐటీఐలు తీసుకుంటాయి. దీని ద్వారా ఐటీఐతో విద్యార్థులకు మంచి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ టీ–గేట్ పనిచేస్తోంది. నగరంలోని ఏటీసీ కేంద్రంలో విద్యార్థులకు ఉపయోగపడే కోర్సులకు సంబంధించిన సామగ్రి అంతా చేరడంతో విద్యార్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
కొనసాగుతున్న ప్రవేశాలు
ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఏడు కోర్సులు ఉండగా... వీటిలో కోర్సు ఆధారంగా విద్యార్థుల ప్రవేశాలు ఉంటున్నాయి. అన్ని కోర్సులకు సంబంధించి 172 సీట్లకు గాను 166 భర్తీ అయ్యాయి. ఇక ఏటీసీలో గత ఏడాది 172సీట్లకు గాను అన్నీ భర్తీ అయ్యాయి. ఈ విద్యా సంవత్సరంలో 172 సీట్లకు 165 సీట్లు ఇప్పటికే భర్తీ అయ్యాయి.
కొత్తగా వాక్ ఇన్ అడ్మిషన్
ఐటీఐల్లో ప్రవేశాల ప్రక్రియ రెండో దశ ముగిసింది. కొత్తగా వాక్ ఇన్ అడ్మిషన్ పేరుతో ప్రవేశాలు కల్పించేందుకు నిర్ణయించారు. ఈమేరకు అర్హత కలిగిన అభ్యర్థులు 28వ తేదీ వరకు ప్రతిరోజు 11 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకొని కళాశాలల్లో దరఖాస్తు ఫారంతో పాటు ఒరిజనల్ సర్టిఫికెట్లు సమర్పిస్తే పరిశీలించి ఖాళీల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
ప్రవేశాలకు ముమ్మర ప్రయత్నాలు
ఇటీవలటీ–గేట్ బృందం ప్రవేశాల పెంపు, కావాల్సి న సౌకర్యాలు, ఉపాధి అవకాశాలపై సమీక్ష నిర్వహించింది. ఇందులో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి అందుకు అవసరమైన ప్రణాళికలు రూ పొందించారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కలిసి ఆయా అంశాలను వివరించారు. ఇదిలా ఉండగా కలెక్టర్ అనుదీప్ ఇటీవల ఐటీఐని సందర్శించి పలు సూచనలు చేశారు. అంతకు ముందు కలెక్టరేట్, కేఎంసీల్లో అదనపు కలెక్టర్ శ్రీజ ఐటీఐల్లో ప్రవేశాల పెంపునకు అధికారులతో చర్చించారు.
ఐటీఐ విద్యను అభ్యసించడం వల్ల విద్యార్థులకు చదువుతోపాటే ఉపాధి అవకాశాలు లభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు విద్యను అభ్యసించి ఉపాధి అవకాశాలు చూపించగా.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం టీ–గేట్ ఏర్పాటు చేసింది. దీనివల్ల విద్య, ఉపాధితోపాటు కళాశాలలో అవసరమైన సదుపాయాలు సైతం సమకూరడంతో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెండుగా లభించనున్నాయి. – ఎ.శ్రీనివాసరావు,
ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఐటీఐ, టీ–గేట్ కన్వీనర్

ఐటీఐతో ఉపాధి అవకాశాలు

ఐటీఐతో ఉపాధి అవకాశాలు

ఐటీఐతో ఉపాధి అవకాశాలు