
పేద ప్రజల గొంతుక.. సురవరం
ఖమ్మంమయూరిసెంటర్: పేద, కార్మిక వర్గాల సమస్యలను చట్టసభల్లోనే కాక పలు వేదికలపై వినిపించిన సురవరం సుధాకర్‌రెడ్డి ప్రజల గొంతుకగా నిలిచారని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్‌రెడ్డి తెలిపారు. సీపీఐ జాతీయ నాయకుడు, మాజీ ఎంపీ సుధాకర్‌రెడ్డి మృతి చెందగా, ఆయన సంతావసభ శనివారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సురవరం చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించాక జితేందర్‌రెడ్డి మాట్లాడారు. పార్లమెంటరీ వ్యవస్థలో గొప్పవిగా చెప్పుకునే 18ఏళ్లకే ఓటు హక్కు, సమాచార హక్కుచట్టం, ఉపాధి హామీ పథకం సాధనలో సురవరం కీలక భూమిక పోషించారన్నారు. ఖమ్మం జిల్లాతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తుచేశారు. ఈ సభలో పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు సిద్దినేని కర్ణకుమార్, నాయకులు శింగు నర్సింహారావు, పోటు కళావతి, పగడాల మల్లేష్, మేకల శ్రీనివాసరావు, పుచ్చకాయల కమలాకర్, వై.సాంబశివరెడ్డి, కూచిపుడ్డి రవి, నూనె శశిధర్, వరద నర్సింహారావు, ఎస్.కే.సైదా తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యాన ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో సురవరం సంతాప సభ నిర్వహించగా నాయకులు రావి శివరామకృష్ణ, ఇటికాల రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, ప్రిన్సిపాల్ రామారావు పాల్గొన్నారు.
పలువురు నేతల నివాళి
ఖమ్మం వైరారోడ్: సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్‌రెడ్డి మృతిపై వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు సంతాపం ప్రకటించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావుతో పాటు నాయకులు తాతా మధుసూదన్, బాగం హేమంతరావు, దండి సురేష్, మహ్మద్ మౌలానా, పోటు రంగారావు, నున్నా నాగేశ్వరరావు వేరువేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు.
సంతాపసభలో సీపీఐ నాయకులు