
80మందికి హెచ్‌ఎంలుగా పదోన్నతి
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని వివిధ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లు(ఎస్‌ఏ)లుగా విధులు నిర్వర్తిస్తున్న 80మందికి గ్రేడ్–2 హెచ్‌ఎంలుగా పదోన్నతి లభించింది. ఈమేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయగా పలువురు నూతన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఏడుగురికి ఆదిలాబాద్ వంటి సుదూర ప్రాంతాల్లో పోస్టింగ్ రావడంతో ప్రమోషన్ తీసుకోమని డీఈఓ కార్యాలయంలో లేఖలు అందజేశారు. ఇక ఎస్‌జీటీల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతికి అర్హులైన ఉపాధ్యాయుల సీనియారిటీ, ఖాళీల జాబితాను శనివారం విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక జాబితాపై శుక్రవారం అభ్యంతరాలు స్వీకరించగా తుది జాబితా శనివారం విడుదల చేస్తారు. కాగా, డీఈఓ కార్యాలయంలో ఇటీవల ఏఎంఓ బాధ్యతలు చేపట్టిన రాజశేఖర్‌కు గ్రేడ్–2 హెచ్‌ఎంగా పదోన్నతి లభించింది. దీంతో ఆయన ఇక్కడ రిలీవ్ అయి మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో బాధ్యతలు స్వీకరించారు. ఏఎంఓ స్థానాన్ని ఒకటి, రెండు రోజుల్లో భర్తీ చేయనున్నట్లు తెలిసింది.