లోకం చూడని బిడ్డలు | - | Sakshi
Sakshi News home page

లోకం చూడని బిడ్డలు

Aug 22 2025 3:18 AM | Updated on Aug 22 2025 3:18 AM

లోకం చూడని బిడ్డలు

లోకం చూడని బిడ్డలు

జిల్లాలో తగ్గుతున్న బాలికల సంఖ్య

గత ఏడాది కంటే

మరింత తగ్గడంపై ఆందోళన

ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో భ్రూణహత్యలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. కడుపులో పెరుగుతున్నది ఆడబిడ్డ అని తెలిస్తే చాలు పొట్టలోనే చిదిమేస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు, ఫలితాల వెల్లడి చట్టప్రకారం నేరమని తెలిసినా కొందరు అదేమీ పట్టించుకోవడం లేదు. జిల్లా కేంద్రంతో పాటు మండలాల్లోని ప్రైవేట్‌ ఆస్పత్రులు, నర్సింగ్‌హోమ్‌ల్లో లింగ నిర్ధారణ పరీక్షలు అడ్డగోలుగా నిర్వహిస్తున్నారు. ఆపై భ్రూణహత్యలకు పాల్పడుతుండడంతో జిల్లాలో అబ్బాయిలు, అమ్మాయిల నిష్పత్తిలో తేడా కనిపిస్తోంది.

అప్పుడు 926.. ఇప్పుడు 864

గతంతో పోలిస్తే జిల్లాలో ఈ ఏడాది సీ్త్ర, పురుష నిష్పత్తిలో తేడా నమోదైంది. ప్రతీ వేయి మంది మగ వారికి కేవలం 864 మందే ఆడవారు ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాది ఈ సంఖ్య 926గా ఉండగా.. ఇప్పుడు మరింత తగ్గడం యథేచ్ఛగా భ్రూణహత్యలు జరుగుతున్నాయనడానికి నిదర్శనంగా నిలుస్తోంది.

అధికారుల పర్యవేక్షణ ఎక్కడ?

సులువుగా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించే అవకాశం ఏర్పడడానికి వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణ లోపించడమే కారణమని తెలుస్తోంది. గర్భస్థ శిశు లింగ నిర్ధారణను బహిర్గతం చేయడం, పిండ దశలోనే హత్య చేయటం చట్టప్రకారం నేరం. దీన్ని విస్మరించే వారికి జైలు శిక్ష, జరిమానా విధించేలా చట్టం ఉన్నా అమలు కావడం లేదు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధగా కొందరు స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని సమాచారం. కొందరు ఆర్‌ఎంపీలు ముఠాలుగా ఏర్పడి గర్భిణులను స్కానింగ్‌ సెంటర్లకు తీసుకొచ్చి పరీక్ష చేయించడమే కాక అవసరమైతే అబార్షన్‌ చేయించేలా ఒప్పందం కుదర్చుకుంటున్నారని సమాచారం. ఇటీవల ఓ ముఠా సభ్యులు వాహనంలోనే యంత్రాల సాయంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు బయటపడినా కఠిన చర్యలేవీ తీసుకోకపోవడంతో అలాంటి వారి ఆగడాలు ఆగడం లేదు.

తనిఖీలు లోపించడంతో..

జిల్లాలో గత ఏడాది ఆరంబంలో లింగ నిర్ధారణ, అబార్షన్లు చేస్తున్న సెంటర్లపై వైద్య, ఆరోగ్య శాఖ దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా కొన్ని ఆస్పత్రులను సీజ్‌ చేసినా ఆతర్వాత పట్టించుకోకపోవడంతో పరిస్థితి యథాస్థితికి చేరింది. సీజ్‌ చేసిన ఆస్పత్రులు వేరే పేర్లతో రిజిస్ట్రేషన్‌ చేయించి తిరిగి దందా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక ఆ తర్వాత ఎక్కడా తనిఖీ చేసిన దాఖలు లేకపోగా.. ఫిర్యాదు వస్తే తనిఖీలు చేస్తామని అధికారులు చెబుతుండడం విమర్శలకు తావిస్తోంది. గర్భిణులకు ప్రత్యేక పరిస్ధితుల్లో మాత్రమే లింగ నిర్ధారణ పరీక్ష చేయించేందుకు అనుమతి ఉంటుంది. కడుపులో పెరుగుతున్న పిండం జన్యు సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నట్లు అనుమానం ఉంటే పరీక్ష చేయిస్తారు. రెండుసార్లు అంత కంటే ఎక్కువ సార్లు గర్భస్రావం జరిగినప్పుడు, గర్భిణి, ఆమె భర్త కుటుంబీకుల్లో ఎవరికై నా బుద్ది మాంధ్యం, శారీక వైకల్యం, జన్యు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నా పిండానికి పరీక్షకు అనుమతి ఉంటుంది. కానీ వైద్య, ఆరోగ్యశాఖ నిర్లిప్తతతో కొన్ని స్కానింగ్‌ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు.. ఆపై భ్రూణహత్యలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికై నా వైద్య ఆరోగ్య, పోలీస్‌, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో ఈ పరీక్షలను కట్టడి చేయకపోతే జిల్లాలో ఆడపిల్లల నిష్పత్తి మరింత దిగజారే ప్రమాదముంది.

ఆడశిశువుగా తేలితే కడుపులోనే చిదిమేస్తున్న వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement