
రెండు కళ్లలా సంక్షేమం, అభివృద్ధి
● ‘భూభారతి’తో భూసమస్యల శాశ్వత పరిష్కారం ● ప్రజాప్రభుత్వానికి అంతా అండగా నిలవాలి ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
తిరుమలాయపాలెం/నేలకొండపల్లి: పేదల సంక్షేమం, అభివృద్ధిని తమ ప్రభుత్వం రెండు కళ్లలా భావిస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈనేపథ్యాన అన్ని వర్గాల ప్రజలు తమకు అండగా నిలవాలని ఆయన కోరారు. తిరుమలాయపాలెం మండలంలోని సుబ్లేడు, పిండిప్రోలు, నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంలో రహదారుల నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేసిన మంత్రి నేలకొండపల్లిలో పశు ఆస్పత్రి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆయా సమావేశాల్లో మంత్రి పొంగుటేటి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతీ మారుమూల గ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వాన అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. గత ప్రభుత్వం అమలుచేసిన మంచి కార్యక్రమాలను బేషజాలకు పోకుండా కొనసాగిస్తూనే.. అదనంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుచేస్తూ ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అలాగే, రైతులకు పెట్టుబడి సాయం పెంచామని, రుణమాఫీ చేయడమే కాక అర్హులకు రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతీఒక్కరికి ఇల్లు మంజూరు చేసే బాధ్యత తాను తీసుకుంటానని మంత్రి చెప్పారు. కాగా, భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నట్లు వెల్లడించారు.
పాఠశాలల్లో వసతుల కల్పనకు రూ.497 కోట్లు
పాలేరు నియోజకవర్గంలోని విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధికి రూ.497 కోట్లు వెచ్చిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలు, నేలకొండపల్లి మండలంలోని బోదులబండ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థినులకు పీఎస్‌ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యాన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి సైకిళ్లు పంపిణీ చేశాక మంత్రి మాట్లాడారు. గడిచిన 19 నెలల కాలంలో నియోజకవర్గంలో రూ.497 కోట్ల నిధులతో పాఠశాలల్లో వసతులు కల్పించామని తెలిపారు. అలాగే, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణం, తిరుమలాయపాలెంలో ఐటీఐ, కూసుమంచిలో జూనియర్ కళాశాల మంజూరు చేశామని చెప్పారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ విద్యార్థినులు పాఠశాలలకు రావడానికి ఇబ్బంది పడకుండా పీఎస్‌ఆర్ ట్రస్టు ద్వారా మంత్రి సైకిళ్లు పంపిణీ చేస్తున్నందున సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కాగా, పిండిప్రోలు జెడ్పీహెచ్‌ఎస్‌లో కిచెన్ షెడ్, మధ్యాహ్న భోజన నాణ్యతను తనిఖీ చేసిన మంత్రి, నేలకొండపల్లి మండలానికి చెందిన 25 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో డీఈఓ నాగపద్మజ, ఆర్ అండ్ బీ, పీఆర్ ఎస్‌ఈలు యాకోబ్, వెంకట్‌రెడ్డి, జీసీడీఓ తులసి, ఆర్‌డీఓ నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, తహసీల్దార్లు విల్సన్, వెంకటేశ్వర్లు, ఎంపీడీఓలు సిలార్‌సాహెబ్, ఎర్రయ్య, పీఏసీఎస్, ఆత్మ, మార్కెట్ చైర్మన్లు నరేష్‌రెడ్డి, చావా శివరామకృష్ణ, వెన్నపూసల సీతారాములు, ఎంఈఓ శ్రీనివాసరావు, హెచ్‌ఎంలు జ్యోతి, నిర్మలతో పాటు బెల్లం శ్రీనివాస్, మంగీలాల్, అశోక్, బొర్రా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సమరానికి సిద్దం కండి
కూసుమంచి: త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నందున పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో సమావేశమైన ఆయన దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి స్థానిక ఎన్నికల్లో వారి మద్దతు పొందాలని తెలిపారు. గ్రామాల్లో మంచి వ్యక్తిని అంతా కలిసి ఎంపిక చేసి బరిలోకి దింపితే విజయం సొంతమవుతుందని చెప్పారు. ఇదే సమయాన పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లభిస్తుందని, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి సూచించారు.

రెండు కళ్లలా సంక్షేమం, అభివృద్ధి