
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా బిల్లు
ఖమ్మంఅర్బన్: ప్రతిపక్షాలను అణచివేయడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం పార్లమెంట్‌లో 30 రోజుల కస్టడీ బిల్లును ప్రవేశపెట్టిందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. అవినీతి నిర్మూలన పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్లు బీజేపీకి గిట్టని పార్టీల ప్రభుత్వాలను అస్థిరం చేయడానికి పన్నిన కుట్రలో భాగమేనని.. తద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయనున్నారని పేర్కొన్నారు. ఖమ్మం టేకులపల్లిలో గురువారం నిర్వహించిన సీపీఎం నాయకుడు దొంగల కోటయ్య సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. ముప్ఫై రోజుల పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ప్రధాని సైతం కస్టడీలో ఉంటే పదవులకు అనర్హులవుతారని బిల్లు పెట్టడం కేంద్ర ప్రభుత్వ ధోరణికి నిదర్శనమని తెలిపారు. ప్రజాసమస్యలపై పోరాడే నేతలను జైలులో పెడితే ఈ చట్టం ద్వారా పదవులు కోల్పోయే అవకాశముందని చెప్పారు. వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి బి.వెంకట్ మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలను అణచివేయడానికే మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎం.సాయిబాబు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శనరావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌తో పాటు నాయకులు వై.విక్రమ్, నాగరాజు, బుగ్గవీటి సరళ, బండి రమేష్, కళ్యాణం వెంకటేశ్వరరావు, మచ్చా వెంకటేశ్వర్లు, రాజారావు, పొన్నం వెంకటేశ్వరరావు, మాదినేని రమేష్, బొంతు రాంబాబు, యర్రా శ్రీనివాసరావు, బండి పద్మ, దొంగల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని