
మెడికల్ కాలేజీలో ప్రారంభమైన ప్రవేశాలు
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 2025–26 సంవత్సరానికి మొదటి సంవత్సరం విద్యార్థుల ప్రవేశాలు మొదలయ్యాయి. జాతీయ కోటాలో 15శాతం సీట్లు భర్తీ చేస్తుండగా మొదటి విడత కౌన్సెలింగ్‌లో ఐదుగురు చేరారు. ఇందులో కేరళ నుంచి ఇద్దరు, ఏపీ, రాజస్తాన్, ఢీల్లీ నుండి ఒక్కొక్కరు ఉన్నారు. మరో రెండు విడతల్లో జరిగే కౌన్సెలింగ్‌లో మొత్తం సీట్లు భర్తీ కానున్నాయి. ఇక 85శాతం సీట్లు రాష్ట్రస్థాయి విద్యార్థులకు కేటాయించనుండగా, స్థానికత విషయంలో కోర్టులో కేసు ఉండడంతో వచ్చే నెల కౌన్సెలింగ్ ప్రారంభమయ్యే అవకాశముందని ప్రిన్సిపాల్ డాక్టర్ శంకర్ తెలిపారు. కాలేజీలో 100 సీట్లు ఉండగా, వచ్చేనెల 15నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతలు ప్రారంభమయ్యే అవకాశముంది.
సీజనల్ వ్యాధులపై
అప్రమత్తత
చింతకాని: వరుస వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించాలని డీఎంహెచ్‌ఓ కళా వతిబాయి సూచించారు. చింతకాని మండలం రామకృష్ణాపురంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని గురువారం తనిఖీ చేసిన ఆమె మాట్లాడారు. గ్రామాల్లో ఆశా కార్యకర్తలు ప్రతి రోజు డ్రై డే నిర్వహిస్తూ పరిశుభ్రత ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నీటి నిల్వల ప్రాంతాల్లో దోమల నివారణ మందు పిచికారీ చేయించాలని సూచించారు. అనంతరం ఆమె గ్రామంలో నిర్వహిస్తున్న ఫీవర్ సర్వే తనిఖీ చేయగా, గర్భిణుల రిజిస్ట్రేషన్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల పెంపుపై సూచనలు చేశారు. వైద్యులు ఆల్తాఫ్, తబుసం, ఏఎన్‌ఎం జయమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లకు
ప్రతీ సోమవారం బిల్లులు
ముదిగొండ: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణాల్లో వేగం పెంచాలని జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత సూచించారు. నిర్మాణ దశలకు అనుగుణంగా లబ్ధిదారుల ఖాతాల్లో ప్రతీ సోమవారం బిల్లులు జమ అవుతాయని తెలిపారు. ముదిగొండ మండలంలోని పండ్రేగుపల్లి, ఖానాపురం, న్యూలక్ష్మీపురంల్లో గురువారం ఆమె ఇళ్ల నిర్మాణ పురోగతిని పర్యవేక్షించారు. ఎంత త్వరగా పూర్తి చేస్తే అంతే త్వరగా బిల్లులు జమ అవుతాయని తెలిపారు. ఈ విషయమై అధికారులు పర్యవేక్షిస్తూ లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆ తర్వాత గ్రామాల్లో పారిశుద్ధ నిర్వహణపై సూచనలు చేశారు. ఎంపీడీఓ శ్రీధర్‌స్వామి, ఎంపీఓ వాల్మీకి కిషోర్, హౌసింగ్ ఏఈ సతీష్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
హెచ్‌ఎంల వెబ్‌ఆప్షన్లు పూర్తి
● నేటి నుంచి ఎస్‌జీటీల పదోన్నతులు
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో స్కూల్ అసిస్టెంట్లకు హెచ్‌ఎంలుగా పదోన్నతి కల్పించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈమేరకు బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు 67మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారని అధికారులు తెలిపారు. దీంతో వీరికి గురువారం అర్ధరాత్రి వరకు గ్రేడ్–2 హెచ్‌ఎంలుగా పదోన్నతి ఉత్తర్వులు అందే అవకాశముంది. ఇక సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఎస్‌జీటీ)కు స్కూల్ అసిస్టెంట్లు(ఎస్‌ఏ)లుగా పదోన్నతి ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం కొనసాగించనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సీనియారిటీ జాబితా, ఖాళీలు ప్రదర్శిస్తారు. ఆపై అభ్యంతరాలు స్వీకరించాక తుది జాబితాను ఈ నెల 23, 24వ తేదీల్లో విడుదల చేస్తారు. అనంతరం 25వ తేదీన వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించి, 26వ తేదీన పదోన్నతి ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

మెడికల్ కాలేజీలో ప్రారంభమైన ప్రవేశాలు