
చిన్నారుల ఎదుగుదలపై పర్యవేక్షణ
● అంగన్‌వాడీల్లో వంద శాతం ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారానే హాజరు ● అదనపు కలెక్టర్ శ్రీజ
ఖమ్మంమయూరిసెంటర్: అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల ఎదుగుదలను నిరంతరం పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖపై సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసినందున పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతుంటే పౌష్టికహారం సమకూర్చాలని తెలిపారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేసే ఉద్యోగులు జిల్లాలో పనిచేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. అలాగే, అంగన్‌వాడీ కేంద్రాల్లో హాజరు ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారానే నమోదు చేయాలని తెలిపారు. కేంద్రాల్లో అవసరమైన మరమ్మతులు చేయించాలని సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి కె.రాంగోపాల్‌రెడ్డి, సీడీపీఓలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
పెద్దాస్పత్రి నిర్వహణపై ఆగ్రహం
ఖమ్మంవైద్యవిభాగం: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని అదనపు కలెక్టర్ శ్రీజ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మరుగుదొడ్ల మరమ్మతులకు నిధులు కేటాయించినా పనులు చేయకపోవడంపై టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, పలు విభాగాల్లో అపరిశుభ్రంగా ఉండడాన్ని గుర్తించిన ఆమె సిబ్బందిని మందలించారు. మెడికల్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్, ఆర్‌ఎంఓ బి.రాంబాబు పాల్గొన్నారు.