
కొరత పేరుతో దందా
యూరియాకు ఎరువులు,
పురుగుమందులతో లింకు
అన్నదాతలను దగా చేస్తున్న వ్యాపారులు
అక్రమార్కులకు వ్యవసాయ శాఖ
నోటీసులు
చట్టపరమైన చర్యలు తప్పవు..
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో కొందరు ఎరువుల వ్యాపారుల దందాకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. యూరియా కొరతను సాకుగా చూపుతూ రైతులను మోసం చేయడమే లక్ష్యంగా ఎత్తులు వేస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి యూరియా కొరత ఏర్పడడంతో.. పీఏసీఎస్‌ల్లో ఒక్కో రైతుకు ఒకటి, రెండు బస్తాలే ఇస్తున్నారు. దీంతో రైతులు వ్యాపారులను ఆశ్రయిస్తుండగా యూరియా ఇవ్వాలంటే ఇతర ఎరువులు, పురుగు మందులు అంటగడుతున్నారు. ఇంకొందరు బినామీల ఇళ్లలో యూరియా నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈనేపథ్యాన తాజాగా టాస్క్‌ఫోర్స్ బృందాలు చేపట్టిన తనిఖీల్లో జిల్లాలోని ఐదు ఎరువుల దుకాణాల్లో అక్రమాలు వెలుగుచూశాయి. దీంతో ఆయా షాపుల నిర్వాహకులకు వ్యవసాయ శాఖ నోటీసులు జారీ చేసింది.
అధిక ధర.. ఆపై ఇతర మందులు
యూరియా బస్తా ఎమ్మార్పీ రూ.266 కాగా రూ.310గా పలువురు వ్యాపారులు అమ్ముతున్నారు. ఇదికాక రూ.500 నుంచి రూ.600 ధర ఉన్న బయోఫెర్టిలైజర్ బస్తాను రూ.900కు అంటగడుతున్నారు. ఇంకొందరు పురుగు మందులను బలవంతంగా కొనసాగాలని చెబుతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే నెపాన్ని కంపెనీలపైకి నెడుతుండడం గమనార్హం. అయినా యూరియా కొరతతో రైతులు చేసేదేం లేక వ్యాపారులు చెప్పినట్లు కొనుగోలు చేస్తున్నారు.
అక్కడకు వెళ్లండి...
వ్యాపారులకు సరఫరా అయ్యే యూరియాను బినామీల ఇళ్లలో నిల్వ చేస్తున్నారు. రైతులెవరైనా షాప్‌నకు యూరియా కోసం వెళ్తే తమ వద్ద లేదంటూ బినామీల వద్దకు పంపిస్తున్నారని సమాచా రం. అక్కడకు వెళ్తే యూరియా బస్తాను రూ.400కు అమ్ముతుండడం గమనార్హం. ఇక సహకార సంఘాల్లో సంఘాల పాలకవర్గాలు, రాజకీయ పార్టీల నాయకులు సిఫారసు చేసిన వారికి అడిగినంత యూరియా ఇస్తున్నారని సమాచారం. మిగిలిన వారికి ఒకటి, రెండు బస్తాలే ఇస్తుండడంతో రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోంది.
వెలుగుచూసిన అక్రమాలు
యూరియా కొరతతో అన్నదాతలు ఇబ్బంది పడుతుండగా వ్యాపారులు దందాకు పాల్పడుతున్నట్లు పోలీస్ యంత్రాంగానికి సమాచారం అందింది. దీంతో పోలీస్ కమిషనర్ ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్ బృందాలు వివిధ షాపుల్లో తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ధర పెంచడం, ఇతర ఎరువులు అంటగడుతున్న విషయం నిజమేనని తేలింది. దీంతో ఐదు ఎరువుల షాపుల్లో అక్రమాలపై వ్యవసాయ శాఖకు నివేదించగా..వారికి షోకాజు నోటీసులు జారీ చేశారు. అయితే, వ్యాపారులు మాత్రం కంపెనీలు ఇస్తుండడంతో అమ్ముతున్నామే తప్ప తమ తప్పేమి లేదని తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. కాగా, సీజన్ ఆరంభం నుంచి ఎరువుల దందా కొనసాగుతున్నా వ్యవసాయ శాఖ ఒక్క కేసు నమోదు చేయకపోవడం.. పోలీసులు తనిఖీ చేసే వరకు మేల్కొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేలకొండపల్లిలోని లక్ష్మీప్రసన్న ఫెర్టిలైజర్స్, రఘునాథపాలెం మండలం మంచుకొండలోని న్యూకుమార్ ఫెర్టిలైజర్స్, చింతకాని మండలం నాగులవంచలోని అన్నదాత ఎంటర్‌ప్రైజెస్, సత్తుపల్లిలోని పార్దసారధి ట్రేడర్స్, గంగారంలోని వెంకటేశ్వర ఫెర్టిలైజర్స్‌కు షోకాజు నోటీసులు జారీ అయ్యాయి.
ఇతర ఎరువులతో లింక్ చేసి యూరియా విక్రయించటం చట్టవిరుద్ధం. ఈ విషయంలో రైతులు ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. టాస్క్‌ఫోర్స్ బృందాల దాడిలో అక్రమాలకు పాల్పడినట్లు తేలిన ఐదు షాపుల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చాం. దీనికి వివరణ అందాక చర్యలు తీసుకుంటాం.
– ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి

కొరత పేరుతో దందా