
అంతటా అప్రమత్తం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు.. ఎగువ ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్న నేపథ్యాన అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గత ఏడాది అనుభవాల దృష్ట్యా ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా మున్నేరు పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మున్నేటికి ఇరువైపులా ఇప్పటికే పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. అత్యవసర సమయాన సహాయక చర్యల కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. చెరువులు, వాగుల వద్ద పెట్రోలింగ్ ముమ్మరం చేయడమే కాక కలెక్టరేట్, పోలీసు కమిషనరేట్, మున్సిపాలిటీల్లో కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటుచేశారు.
పరీవాహకంలో ఎడతెరిపి లేకుండా..
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షపాతం వివరాలను అధికారులు తెప్పించుకుంటున్నారు. వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. బుధవారం కూడా మున్నేరు, ఆకేరు పరీవాహక జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. మున్నేరు పరీవాహకంలో రాత్రి 8గంటల వరకు 7.1 సెం.మీ., ఆకేరు పరీవాహ కంలో 1.0 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
పునరావాస కేంద్రాలు
భారీ వర్షాలు, వరదల నేపథ్యాన మున్నేటి పరీవాహక ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తల్లో నిమగ్నమయ్యారు. శిక్షణ వలంటీర్లతో అవగాహన కల్పి స్తూనే గజ ఈతగాళ్లు, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సమాయత్తం చేశారు. ఖమ్మం కార్పొరేషన్‌లో 12డివిజన్లు, ఏదులాపురం మున్సిపాలిటీలో 12వార్డులను ముంపు ప్రాంతాలుగా గుర్తించారు. ఈ ప్రాంతా లను వరద ముంచెత్తితే ప్రజలకు ఆశ్రయం కల్పించేలా 11 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.
కట్టుదిట్టంగా ఏర్పాట్లు
వరదలపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అలాగే, పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ పోలీస్ యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. ఉధృతంగా ప్రవహిస్తున్న చెరువులు, వాగుల వద్ద పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. మత్య్సకారులు చేపల వేటకు వెళ్లవద్దని, పశువుల కాపరులెవరూ చెరువులు, వాగులు దాటొద్దని హెచ్చరించారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉంటే వంతెనలు, చప్టాలపై రాకపోకలు నిలిపేస్తున్నారు.
ఆపద తొలగే వరకు..
ఒకేసారి భారీ వర్షం పడి వరద ముంచెత్తితే తక్కువ సమయంలో తీవ్ర నష్టం వాటిల్లుతుంది. గత ఏడా ది ఇలాంటి అనుభవమే ఎదురైనందున ఈసారి ముందస్తు చర్యలకు ఉపక్రమించారు. డ్రెయిన్లలో మురుగునీరు నిల్వ ఉండకుండా సాఫీగా వెళ్లేలా శుభ్రం చేయిస్తూనే పారిశుద్ధ్య పనులపైనా దృష్టి సారించారు. కాగా, పోలీస్ కమిషనర్ సునీల్‌దత్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య బుధవారం కాల్వొడ్డు, ప్రకాష్‌నగర్ ప్రాంతాల్లో మున్నేరు వరదను పరిశీలించి పరిస్థితులు అంచనా వేశారు. బుధవారం సాయంత్రం ఖమ్మంలోని కాల్వొడ్డు వద్ద మున్నేరు 10 అడుగుల మేర ప్రవహిస్తోంది.
నేడు విద్యాసంస్థలకు సెలవు
భారీ వర్షాల నేపథ్యాన అన్ని యాజమాన్యాల పరిధి విద్యాసంస్థలకు గురువారం సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. అలాగే, ప్రజలు అప్ర మత్తంగా ఉంటూ అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, నీటి ప్రవాహాలు దాటే ప్రయత్నం చేయొద్దని ఆయన సూచించారు.
వాతావరణ శాఖ హెచ్చరికలతో ముందస్తు చర్యలు
మున్నేటికి ఇరువైపులా
పునరావాస కేంద్రాలు సిద్ధం
చెరువులు, వాగుల వద్ద పెట్రోలింగ్
అందుబాటులోకి వలంటీర్లు,
ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు
నేడు విద్యాసంస్థలకు సెలవు
16 అడుగుల వరద వస్తే మొదటి హెచ్చరిక..
కాల్వొడ్డు వద్ద మున్నేరు 16అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తాం. ఆ వెంటనే కాల్వొడ్డు, బొక్కలగడ్డ ప్రాంతాల్లోని వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తాం. నగరంలోని 12 డివిజన్ల పరిధిలో లోతట్టు ప్రాంతాలను గుర్తించాం. అక్కడి ప్రజలను అప్రమత్తం చేసేందుకు వలంటీర్లను సిద్ధం చేశాం. ఎవరెవరిని ఏ పునరావాస కేంద్రానికి తరలించాలో మ్యాపింగ్ కూడా చేశాం.
– అభిషేక్ అగస్త్య, కమిషనర్, కేఎంసీ
టోల్‌ఫ్రీ, కంట్రోల్ రూమ్ నంబర్లు
కార్యాలయం నంబర్లు
కలెక్టరేట్ 1077, 90632 11298
కేఎంసీ 83338 33696
ఏదులాపురం 95156 85414
ఖమ్మంరూరల్ తహసీల్ 83319 30583
పోలీసులు డయల్ 100
పోలీసు కమిషనరేట్ 87126 59111

అంతటా అప్రమత్తం

అంతటా అప్రమత్తం