
వరదతో పాటే వ్యాధులు
● జిల్లాలో పెరుగుతున్న డెంగీ కేసులు, జ్వరాలు ● డెంగీ కేసులు 50 దాటడంతో అప్రమత్తత ● ఫీవర్ సర్వేలో వెలుగుచూస్తున్న జ్వరబాధితులు
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో సీజనల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా డెంగీ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడం ఆందోళన కలిగి స్తోంది. కొంతకాలంగా కురుస్తున్న వర్షాలతో పారిశుద్ధ్య సమస్య ఏర్పడి డెంగీ, వైరల్ జ్వరాలు పెరుగుతున్నాయని భావిస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య ఎక్కువగానే ఉండడంతో జనం ఆస్పత్రుల బాట పడుతున్నారు. దీనికితోడు అధికారులు చేపట్టిన ఫీవర్ సర్వేలోనూ వందలాది కేసులు వెలుగు చూస్తున్నాయి.
వెలుగులోకి వందలాది కేసులు
గత నెలలో జిల్లాలో సీజనల్ వ్యాధుల ప్రభావం మొదలైంది. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమై పీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, సబ్ సెంటర్ల పరిధిలో ఫీవర్ సర్వే చేపట్టింది. ఆశాలు, ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లి అనుమానితుల రక్త నమూనాలు సేకరించి మందులు పంపిణీ చేస్తున్నారు. పరిస్థితి తీవ్రత ఉన్న వారిని ఆస్పత్రులకు తరలించారు. జూలై 8నుంచి 24వ తేదీ వరకు మొదటి విడత చేపట్టిన ఫీవర్ సర్వేలో రెండు హైరిస్క్ ఏరియాలను జల్లెడపట్టారు. ఈమేరకు 342 ఇళ్లలో 1,382 మందిని పరీక్షించగా 46 మంది విషజ్వరాలతో భాదపడుతున్నట్లు గుర్తించారు. ఆపై జ్వరాల తాకిడి పెరగటంతో జూలై 28నుంచి రెండో విడత ఫీవర్ సర్వే చేపట్టగా ఇప్పటి వరకు 1,554 మంది జ్వరంతో బాధపడుతున్నట్లు తేలింది.
డెంగీ.. ౖపైపెకి
జిల్లాలో డెంగీ జ్వరాలు ప్రబలుతున్నాయి. ఈనెల 12వ తేదీకి 52 కేసులు అధికారికంగా వెలుగుచూశాయి. అనధికారికంగా కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశముంది. ఖమ్మం నగరంతో పాటు తిరుమలాయపాలెం, రఘునాథపాలెం, తల్లాడ తదితర మండలాల్లో కేసులు ఎక్కువగా వస్తున్నాయి. అయితే, డెంగీ చికిత్స పేరుతో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.70వేల నుండి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అసలైతే ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగీ పరీక్షలకు అనుమతి లేకపోగా.. ఎలీసా పరీక్షల కోసం రక్త నమూనాలను పెద్దాస్పత్రిలోని ఐడీఎస్‌పీ ల్యాబ్‌కు పంపించాలి. కానీ పలు ఆస్పత్రుల్లో పరీక్షలు.. ఆపై చికిత్స పేరుతో దోచుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఫీవర్ సర్వే వివరాలు...
సర్వే చేసిన గృహాలు 1,57,332
పరీక్షించిన వారు 4,37,911
ఫీవర్ కేసులు 1,554
నెలల వారీగా వైరల్ జ్వరాలు, డెంగీ కేసులు
నెల వైరల్ జ్వరాలు డెంగీ
జూన్ 5,947 01
జూలై 6,476 27
ఆగస్టు 2,596 21
(ఇప్పటివరకు)
డెంగీ కేసులు అదుపులోనే...
జిల్లాలో డెంగీ కేసులు అదుపులోనే ఉన్నాయి. కేసులు వెలుగు చూసిన ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాల ద్వారా వ్యాప్తిని కట్టడి చేశాం. ఇక సీజనల్ వ్యాధుల వ్యాప్తి నామమాత్రంగానే ఉంది. ఫీవర్ సర్వేతో ఎప్పటికప్పుడు మందులు ఇస్తుండడంతో ప్రభావం తగ్గిపోయింది. అయినా ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ జ్వరం లక్షణాలు ఉంటే ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోవాలి.
– బి.కళావతిబాయి, డీఎంహెచ్‌ఓ

వరదతో పాటే వ్యాధులు