
గణేష్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాటు
● ప్రతీ విగ్రహం సమాచారం తప్పనిసరి ● అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి
ఖమ్మంగాంధీచౌక్: రానున్న వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. గణపతి నవరాత్రోత్సవాలపై కలెక్టరేట్‌లో బుధవారం అధికారులు, ఉత్సవ కమిటీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వర్షాలు కురిసే అవకాశమున్నందున నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అంతేకాక ప్రతీ మండపం వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకుని, అన్ని వివరాలు సమర్పించాలని సూచించారు. అలాగే, మండపాలకు విద్యుత్ అనుమతి, నిమజ్జం రోజు రూట్‌మ్యాప్ తయారీ తదితర అంశాలపై అదనపు కలెక్టర్ సూచనలు చేశారు. కాగా, గత ఏడాది మాదిరిగా ఈసారి సైతం మట్టి విగ్రహాలు ఏర్పాటుచేయాలని తెలిపారు. ఈ సమావేశంలో కల్లూరు సబ్ కలెక్టర్‌అజయ్‌యాదవ్, డీఆర్వో పద్మశ్రీ, డీపీఓ ఆశాలత, డీఎంహెచ్‌ఓ కళావతిబాయి, కేఎంసీ అసిస్టెంట్ కమీషనర్ అనిల్‌కుమార్, ఖమ్మం స్తంభాద్రి సేవా సమితి అధ్యక్ష, కార్యదర్శులు వినోద్ లాహోటి, కీసర జయపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భూసమస్యల పరిష్కారంపై దృష్టి
తల్లాడ/ఏన్కూరు: భూభారతి రెవెన్యూ సదస్సుల్లో భూసంబంధిత సమస్యలపై అందిన దరఖాస్తుల పరిశీలన, పరిష్కారంలో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. తల్లాడ, ఏన్కూరు తహసీల్దార్ కార్యాలయాలను బుధవారం తనిఖీ చేసిన ఆయన దరఖాస్తుల స్థితిగతులపై సమీక్షించారు. భూభారతి చట్టం నిబంధనల ప్రకారంగా నోటీసులు జారీ చేసి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఏవైనా దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు స్పష్టమైన కారణాలు వెల్లడించాలని సూచించారు. కాగా, ఏన్కూరులోని కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాన్ని సైతం తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి డైనింగ్ హాల్, కిచెన్‌ను పరిశీలించి వర్షాల నేపథ్యాన పరిశుభ్రతపై సూచనలు చేశారు. తహసీల్దార్లు వి.సురేష్‌కుమార్, సీసిహెచ్.శేషగిరిరావు, ఉద్యోగులు భాస్కర్, మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.