
అడవులను సంరక్షిస్తూనే అభివృద్ధి
● రాజకీయాలకు అతీతంగా ఇళ్ల కేటాయింపు ● రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
రఘునాథపాలెం: అభివృద్ధి అనివార్యమైన నేపథ్యాన అడవులను సంరక్షించుకుంటూనే ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంపై యంత్రాంగం దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రఘునాథపాలెం మండలం దొనబండలో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూసమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సూచించారు. గ్రామంలో అవసరమైన డొంక రోడ్లను నెలలోగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సొంత స్థలం ఉండి గుడిసెల్లో ఉంటున్న నిరుపేదలకు తప్పక ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని.. ఇందులో ఎలాంటి రాజకీయాలు ఉండవని మంత్రి స్పష్టం చేశారు.
అడవులకు నరికివేతకు వ్యతిరేకం
కొత్తగా అడవుల ఆక్రమణకు ఎవరు పాల్పడొద్దని మంత్రి తుమ్మల సూచించారు. అడవుల నరికివేతకు తాను వ్యతిరేకమని, అడవి ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. అటవీ ప్రాంతం తగ్గుతుండడంతోనే గ్రామాల్లో కోతుల సమస్య పెరిగిందని చెప్పారు. కాగా, గిరిజన రైతులు పోడు భూముల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని.. తద్వారా ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ రూ.2కోట్ల నిధులతో దొనబండ – గణేశ్వరం రోడ్డు నిర్మాణంతో ఖమ్మంకు దూరం తగ్గుతుందని చెప్పారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్, డీఎఫ్‌ఓ సిద్దార్థ్ విక్రమ్ సింగ్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయలక్ష్మి, ఆర్‌డీఓ నర్సింహారావు, పీఆర్ ఎస్‌ఈ వెంకట్‌రెడ్డి, ఖమ్మం మార్కెట్ చైర్మన్ హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.