బాలికలు ఆదర్శంగా నిలవాలి
● కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ● కొణిజర్ల కేజీబీవీలో వేసవి శిబిరం పరిశీలన
కొణిజర్ల: బాలికల్లో సహజసిద్ధంగా ఉండే నైపుణ్యాలకు కృషి తోడైతే అద్భుత విజయాలు సాధించవచ్చని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ తెలిపారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని కస్తూర్బాగాంధీ విద్యాలయాల(కేజీబీవీ) బాలికలు ఉన్నత స్థాయికి చేరుకుని రాబోయే తరాలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. కొణిజర్ల మండలం బస్వాపురంలోని కేజీబీవీలో కొనసాగుతున్న వేసవి శిక్షణా శిబిరాన్ని సోమవారం సందర్శించిన ఆయన బాలికలు వేసిన చిత్రాలు, తయారుచేసిన బొకేలు, వస్తువులు పరిశీలించి ఆభినందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఏ పనైనా మనస్సు, శరీరం ఏకీకృతంగా చేస్తే విజయం తథ్యమన్నారు. సమాజంలో ఆడపిల్లలపై వివక్ష తొలగిపోయేలా బాలికలు జీవితంలో రాణించాలని సూచించారు. అనంతరం ఎస్సెస్సీ, ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన బాలికలను కలెక్టర్ సత్కరించారు. డీఈఓ సామినేని సత్యనారాయణ, కేజీబీవీ జిల్లా కోఆర్డినేటర్ తులసి, ఇన్‌చార్జ్ తహసీల్దార్ రాము తదితరులు పొల్గొన్నారు.
ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి
పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపికై న గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా చేపట్టాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. కొణిజర్ల మండలం చిన్నగోపతిలో ఇళ్ల నిర్మాణాన్ని తనిఖీ చేసిన ఆయన లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం కావాలా, ఇసుక, మట్టి అందుతోందని అని ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సిమెంట్, స్టీలు వంటివి గ్రూపుగా కలిసి ఒకేచోట కొంటే ధర తగ్గుతుందని తెలిపారు. జిల్లాలోని 20మండలాల్లో ఒక్కో గ్రామాన్ని పైలట్‌గా తీసుకుని 875మందిని ఎంపిక చేశామన్నారు. దఫాలుగా బిల్లు మంజూరు చేస్తుండడమే కాక స్థోమత లేని మహిళా సంఘాల సభ్యులకు రుణం ఇప్పిస్తున్నామని తెలిపారు. అధికారులు శ్రద్ధ వహించి ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, డీఎల్‌పీఓ రాంబాబు, ఇన్‌చార్జి తహసీల్దార్ రాము, డీఈ సాయిరాంరెడ్డి, ఏఈ ఉమామహేశ్వరరావు, జేపీఎస్ జ్యోతి పాల్గొన్నారు.
బాలికలు ఆదర్శంగా నిలవాలి


