స్క్రాప్ దుకాణాల్లో మున్సిపాలిటీ సామగ్రి
వైరా: మున్సిపాలిటీ కార్యాలయ తాత్కాలిక సిబ్బంది కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మున్సిపాలిటీలో పాడైన సామగ్రి పాత ఇనప సామాన్ల దుకాణంలో కనిపిస్తుండడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. రెండు రోజుల కిందట పాత పంచాయతీ కార్యాలయంలో ఉన్న టన్నుల కొద్ది స్క్రాప్‌ను ఎవరి అనుమతులు లేకుండా మసీద్ కాంప్లెక్స్‌లోని ఓ పాత ఇనుప సామగ్రి దుకాణానికి తరలించినట్లు తెలిసింది. పాడైన ఫాగింగ్ మిషన్లు, పాత ఇనుప సామగ్రి, ప్లాస్టిక్ పైపులను టెండర్ ద్వారా విక్రయించాల్సి ఉంటుంది. కానీ, అలాంటిదేమీ లేకుండా విక్రయించినట్లు సమాచారం. మున్సిపల్ పాలకవర్గం లేకపోవడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ చింతా వేణును వివరణ కోసం యత్నించగా ఆయన స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తున్నందున, ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.


