‘సీతారామ’తో జిల్లా సస్యశ్యామలం
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సత్తుపల్లిటౌన్: గోదావరి జలాల ఆధారంగా నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలమవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. సత్తుపల్లి మండలం యాతాలకుంటలో సీతారామ ప్రాజెక్ట్ ట్రంక్ టన్నెల్ పనులను శుక్రవారం ఆయన ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు ముజమ్మిల్‌ఖాన్, జితేష్ వి.పాటిల్, సత్తుపల్లి, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు డాక్టర్ మట్టా రాగమయి, జారె ఆదినారాయణతో కలిసి పరిశీలించారు. సీతారామ మెయిన్ కెనాల్, మూడు పంప్‌హౌస్‌లను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించుకున్నామని తెలిపారు. రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా వచ్చే వర్షాకాలానికి వైరా ప్రాజెక్టు, పినపాక నియోజకవర్గంలోని తుమ్మలపల్లి వద్ద మారేడుపాక ఎత్తిపోతల పథకం, కొత్తగూడెం నియోజకవర్గంలో సింగభూపాలెం ద్వారా నీరు వదలాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు.
నాలుగు నెలల్లో ట్రంక్ నిర్మాణం
సత్తుపల్లి ట్రంక్ టన్నెల్‌లో మిగిలిన 1.2 కి.మీ. పనులు నాలుగు నెలల్లో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. తద్వారా సత్తుపల్లి, పినపాక, మధిర, వైరా, అశ్వారావుపేట నియోజకవర్గాలకు సాగునీరు అందించవచ్చని, వైరా రిజర్వాయర్ కింద లక్షా 30వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందన్నారు. అప్పుడు సాగర్ జలాలు రాకున్నా ఇబ్బంది ఉండదని తెలిపారు. సీతారామ ప్రధాన కాల్వలో సిల్ట్ తొలగిస్తే బేతుపల్లి, వైరా ప్రాజెక్టులోకి సాఫీగా నీరు చేరుతుందన్నారు. కాగా, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి విద్యు త్ సంబంధిత సమస్యల పరిష్కారానికి సూచనలు చేశారు. జల వనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ ఎ.శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఈ శ్రీనివాసరెడ్డి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ శ్రీనివాసాచారి, ఎస్‌డీసీ రాజేశ్వరి, ఆర్డీఓ రాజేందర్‌గౌడ్, ఏడీఏ శ్రీనివాసరెడ్డి, నాయకులు మట్టా దయానంద్, దోమా ఆనంద్, సుజలరాణి, దూదిపాల రాంబాబు పాల్గొన్నారు.


