అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు
తిరుమలాయపాలెం: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. తిరుమలాయపాలెం మండలం హస్నాబాద్‌లో రూ.1.30 కోట్లతో నిర్మించే సైడ్ డ్రెయిన్ పనులకు బుధవారం శంకుస్థాపన చేసిన ఆయన ఏలువారిగూడెంలో రూ.20లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్‌కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. భూసమస్యల పరిష్కారానికి తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో పేదల భూములకు భద్రత లభిస్తుందని మంత్రి తెలిపారు. ఇరిగేషన్ అభివృద్ది సంస్థ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఖమ్మం ఆర్డీఓ నర్సింహారావు, ఆర్ అండ్ బీ ఎస్‌ఈ యుగంధర్, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, డీఎల్‌పీఓ రాంబాబు, ఎంపీడీఓ సిలార్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి


