వర్షం వస్తుంది.. జాగ్రత్త!
● రైతులను అప్రమత్తం చేసేలా సూచనలు ● అందుబాటులోకి ‘వెదర్ యాప్’
ఖమ్మం సహకారనగర్: గత వారం, పది రోజు లుగా ఏ రోజు ఎక్కడ గాలిదుమారం వస్తుందో, వర్షం కురుస్తుందో చెప్పలేని పరిస్థితి ఎదురవుతున్నాయి. దీంతో కల్లాల్లో ధాన్యం ఆరబోసిన రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొన్నిచోట్ల ధాన్యం తడిసి నష్టం ఎదురవుతోంది. అధికారులు సైతం వర్షసూచనలను రైతులకు చేరవేసే పరిస్థితి లేవు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేలా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏ జిల్లాలో, ఏ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రాంతాన వర్షం కురుస్తుందనే సమాచారాన్ని తెలుసుకునేలా రూపొందించిన వెదర్ యాప్ శుక్రవారం అందుబాటులోకి వచ్చిందని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి(డీఎస్‌ఓ) చందన్‌కుమార్ తెలిపారు. నిర్వాహకులకు సమాచారం పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు ప్రతిరోజు ఏ ధాన్యం కొనుగోలు కేంద్రం సమీపాన వర్షం కురిసే అవకాశముందో యాప్ ద్వారా గుర్తిస్తారు. ఈమేరకు సమాచారాన్ని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారికి ఇస్తారు. దీంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకునేలా అప్రమత్తం చేయనున్నారు. జిల్లాలో 345 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరుగుతుండగా, ఎప్పటికప్పుడు అందే సమాచారంతో వీటి పరిధిలోని రైతులకు లబ్ధి జరుగుతుందని డీఎస్‌ఓ చందన్‌కుమార్ తెలిపారు.


