‘భూ భారతి’తో భూసమస్యల పరిష్కారం
● బాధితులు దరఖాస్తు చేసుకోవాలి ● రెవెన్యూ సదస్సుల్లో ఇన్‌చార్జ్ కలెక్టర్ శ్రీజ
నేలకొండపల్లి: భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని ఇన్‌చార్జ్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ వెల్లడించారు. నేలకొండపల్లి మండలం చెరువుమాధారం, కొత్తకొత్తూరు, సధాశివాపురం గ్రామాల్లో శుక్రవారం రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించగా ఆమె పరిశీలించారు. దరఖాస్తు విధానం, రిజిస్టర్‌లో నమోదు, ఇతర వివరాలను హెల్ప్ డెస్క్‌ల వద్ద పరిశీలించి ఉద్యోగులకు సూచనలు చేశారు. అనంతరం ఇన్‌చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ రైతులు గ్రామ సభలను హాజరై భూసమస్యలపై దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. భూములపై హక్కులు కాపాడేలా కొత్త చట్టం అమల్లోకి వచ్చిందని, తద్వారా లావాదేవీలు, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఆర్‌ఓఆర్ తదితర సేవలు సులభతరమవుతాయని చెప్పారు. రికార్డుల్లో తప్పులు సవరణకు అవకాశం కల్పించగా, పెండింగ్ సాదాబైనామా దరఖాస్తులకు సైతం పరిష్కారం లభిస్తుందని తెలిపారు. రైతులకు ఉచిత న్యాయసాయం అందించడమే కాక అప్పీల్‌కు అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. కాగా, చెరువుమాధారంలో 168, సధాశివాపురం లో 48, కొత్తకొత్తూరు సభలో 28 దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. పాలేరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎం.రాజేశ్వరి, ఆర్‌డీఓ నర్సింహారావు, నేలకొండపల్లి మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, తహసీల్దార్లు వి.వెంకటేశ్వర్లు, తఫజుల్ హుస్సేన్, డిప్యూటీ తహసీల్దార్ ఇమ్రాన్, ఎంఆర్‌ఐలు ఆలస్యం మధుసూదన్‌రావు, బి.రవి, సొసైటీ మాజీ చైర్మన్ ఈవూరి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


