
నైరుతికి వేళాయె..
● వాన కబురుతో అన్నదాతల్లో ఆనందం
ఖమ్మంవ్యవసాయం : మండుటెండలతో సతమతమవుతున్న జిల్లా ప్రజలకు చల్లటి వాన కబురు రానే వచ్చింది. నైరుతి రుతుపవనాలు గురువారం కేరళ రాష్ట్రాన్ని తాకినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరో నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి కూడా చేరే అవకాశం ఉందని తెలిపింది. అంటే జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ రుతుపవనాల ప్రవేశం కబురు ప్రజలకు ఊరటనిస్తోంది. ప్రధానంగా రైతులకు ఇది తీపి కబురేనని చెప్పొచ్చు. కొద్ది రోజులుగా ఉపరితల ఆవర్తనం, ద్రోణితో కురిసిన అకాల వర్షాలకు జిల్లా రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. విత్తనాలు వేసేందుకు సన్నద్ధమవుతున్న రైతులకు వాతావరణ శాఖ ప్రకటన మరింత ఉత్సాహాన్నిచ్చింది.