
‘పాలేరు’కు పెద్ద కొడుకుగా ఉంటా
ఖమ్మంరూరల్ : పాలేరు నియోజకవర్గ ప్రజలు తన ను ఎంతో ఆదరించి ఇంతటి వాడిని చేశారని, వారి దీవెనలతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రినయ్యానని, ప్రజలకు పెద్ద కొడుకుగా ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటానని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలో ఆదివారం ‘ప్రజ ల చెంతకే మీ శీనన్న’ కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా 20 గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేసి, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తొలుత మంత్రి పొంగులేటి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి రెడ్డిపల్లిలోని శ్రీ మారెమ్మతల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పలు గ్రామాల్లో ప్రజలతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఏర్పడిందే ప్రజల సమస్యలు తీర్చడానికని, ఎవరికి ఏ సమస్య వచ్చినా ప్రభుత్వపరంగా, వ్యక్తిగతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తాను మాయమాటలు చెప్పనని, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని అన్నారు. తానెప్పుడూ ప్రజలతోనే ఉంటానని, వారితోనే మమేకం అవుతుంటానని తెలిపారు. వరుసగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు రావడంతో అన్ని గ్రామాల పర్యటనల్లో ఆలస్యమైందని చెప్పారు. ఎన్నికల కోడ్ ముగిశాక సంక్షేమ, అభివృద్ధి పనులను ప్రజల దరిచేర్చుతామని అన్నారు. శీనన్నా అని పిలిస్తే అండగా నిలుస్తానని తెలిపారు.
మంత్రి దృష్టికి వచ్చిన సమస్యలివే..
మంత్రి పొంగులేటి పర్యటన సందర్భంగా మంగళగూడేనికి చెందిన కాంగ్రెస్ నాయకులు కన్నేటి నర్సింహారావు పలు సమస్యలను విన్నవించారు. వెన్నారం చెరువును రిజర్వాయర్‌గా మార్చి సీతారామ ప్రాజెక్ట్ నీటితో నింపాలని, గ్రామంలో ఆరోగ్య ఉపకేంద్ర భవనం నిర్మించాలని, వెన్నారం చెరువు నుంచి తీర్థాల వరకు ఉన్న వాగులో పూడిక తీయించాలని కోరారు. అర్హులందరికీ పక్కా ఇళ్లు నిర్మించాలని, పల్లెగూడెం నుంచి మంగళగూడెం వరకు డబుల్ రోడ్ పనులు వేగవంతం చేయాలని విన్నవించారు. పల్లెగూడెంలో బుడగజంగాలకు కమ్యూనిటీ హాల్ నిర్మించాలని, డ్రెయినేజీ సమస్య లేకుండా చూడాలని కోరారు. పోలేపల్లి రామాలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తేవాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇక పొంగులేటి గూడూరుపాడుకు చేరుకోగానే వర్షం ప్రారంభమైనా వానలోనే నిల్చుని ప్రజాసమస్యలను ఓపికగా విన్నారు. గొడుగుతో జనాల వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు.
వనజీవికి భరోసా..
రెడ్డిపల్లిలో వనజీవి రామయ్య మంత్రి వద్దకు వచ్చి సమస్యలు విన్నవించగా నేనున్నా అంటూ భరోసా ఇచ్చారు. ఫంక్షన్‌హాల్ విషయంలో మున్సిపల్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని మంత్రి దృష్టికి తేగా దిగులు పడొద్దని చెప్పారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆప్యాయంగా పలకరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కళ్లెం వెంకటరెడ్డి, మద్ది వీరారెడ్డి, ఎం. నిరంజన్‌రెడ్డి, మద్దినేని బేబీస్వర్ణకుమారి, ధరావత్ రాంమూర్తి నాయక్, మద్ది కిషోర్‌రెడ్డి, మల్లారెడ్డి, కన్నేటి వెంకన్న, బత్తుల కూర్మారావు, బండి జగదీష్, బోడా వెంకన్న, భుజంగరెడ్డి, సీపీఐ నాయకులు పుచ్చకాయల. కమలాకర్, లింగా వెంకటనారాయణ, పుచ్చకాయల సుధాకర్, లూరి భాస్కర్‌రావు, సిద్దినేని కర్ణకుమార్ పాల్గొన్నారు.
నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా
‘ప్రజల చెంతకే మీ శీనన్న’ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి
వనజీవి రామయ్యకు పరామర్శ