అశ్వారావుపేటరూరల్: జాతర ఉత్సవాల్లో చోరీలకు పాల్పడిన ముఠాను శుక్రవారం అశ్వారావుపేట పోలీసులు అరెస్టు చేసి, నిందితుల వద్ద నుంచి నగదు, సెల్‌ఫోన్లను రికవరీ చేశారు. స్థానిక ఎస్‌ఐ శ్రీరాముల శ్రీను కథనం ప్రకారం.. మండలంలోని వినాయకపురంలో ఇటీవల జరిగిన శ్రీ చిలకలగండీ ముత్యాలమ్మ తల్లి తిరునాళ్లలో పలువురు భక్తులు, వ్యాపారుల దగ్గర గుర్తు తెలియని దుండగులు వరుస చోరీలకు పాల్పడిన సంగతి తెలిసిందే. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన వారు దర్యాప్తు చేపట్టారు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన 13 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించగా, ముత్యాలమ్మ తల్లి జాతర ఉత్సవాల్లో చోరీలకు పాల్పడినట్లు నిర్ధారణ అయింది. పట్టుబడిన నిందితుల వద్ద నుంచి చోరీ చేసిన రూ.12 వేల నగదులోపాటు మరో 10 సెల్‌ఫోన్లను రికవరీ చేసి స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, పట్టుబడిన 13 మందిని దమ్మపేట జ్యుడీషియల్ ప్రథమశ్రేణి కోర్టులో హాజరు పరిచారు.
రూ.12 వేల నగదు, 10 సెల్‌ఫోన్లు రికవరీ