
ఖమ్మం స్పోర్ట్స్ : జిల్లాస్థాయి యువజనోత్సవాలు నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం జరుగనున్నాయని డీవైఎస్‌ఓ తుంబూరు సునీల్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామని పేర్కొన్నారు. ఇందులో వ్యక్తిగతంగా, బృందంతో కలిసి జానపద నృత్యం చేయాల్సి ఉంటుందని తెలిపారు. జానపద పాటలు, లైఫ్‌స్కిల్స్ కాంపోనెంట్, వ్యాస రచన, వక్తృత్వ, ఫొటోగ్రఫీ అంశాల్లో పోటీలు ఉంటాయని వివరించారు. పేర్లు నమోదు చేసుకున్న వారు 22న ఉదయం 10 గంటలకు రిపోర్టు చేయాలన్నారు.
విజేతలకు
బహుమతుల ప్రదానం
ఖమ్మం స్పోర్ట్స్ : నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన ఇంటర్ సర్కిల్ విద్యుత్ శాఖ క్రీడల విజేతలకు కలెక్టర్ వి.పి.గౌతమ్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులకు క్రీడలు ఎంతో అవసరమని, మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తాయని చెప్పారు. కబడ్డీలో విజేతగా నిలిచిన నల్గొండ జట్టుకు ట్రోఫీ అందజేశారు. లాన్ టెన్నిస్ పోటీల్లో ఖమ్మం సర్కిల్‌కు చెందిన ఎన్.సోందు సింగిల్స్ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. కార్యక్రమంలో ఖమ్మం స్పోర్ట్స్ జనరల్ సెక్రటరీ జి.బాలు నాయక్, జగన్నాథ్, పి.వి.అప్పారావు, రాజారావు పాల్గొన్నారు.
తెగుళ్లపై
అప్రమత్తంగా ఉండాలి
వైరారూరల్: పంటలను ఆశించే తెగుళ్ల పట్ల రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎం.విజయనిర్మల సూచించారు. మండలంలోని గొల్లపూడి, గోవిందాపురం గ్రామాల్లో బుధవారం ఆమె మిరప, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. మిరప పూత, కాయ దశకు చేరిన నేపథ్యాన కాయకుళ్లు, నల్లతామర పురుగులు ఆశించినట్లు గుర్తించారు. కాయకుళ్లు నివారణకు కాప్టాన్ 1.5 లేదా డైపెన్ కోనజోల్ మందులను 0.5 మి.లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. నల్ల తామర పురుగు నివారణకు బెవెరియా బ్యాసియానో 5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయడంతో పాటు వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పలు రకాల రసాయన మందులు వేయాలని చెప్పారు. మొక్కజొన్నకు కత్తెర పురుగు ఆశించిందని, దీని నివారణకు తొలి దశలో ఎకరానికి నాలుగు లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయడంతో పాటు లీటర్ నీటిలో 5 మిల్లీ లీటర్ల వేప నూనె కలిపి పిచికారీ చేయాలని చెప్పారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ కె. రవికుమార్, జెస్సీ, సునీత, ఫణిశ్రీ, ఏడీఏలు బాబూరావు, శ్రీనివాసరావు, ఏఓ ఎస్.పవన్‌కుమార్, ఏఈఓలు వాసంతి, రాజేష్ పాల్గొన్నారు.
ఫిజిక్స్ మెటీరియల్ ఆవిష్కరణ
ఖమ్మం సహకారనగర్ : భౌతిక, రసాయనిక శాస్త్రాల్లో వెనుకబడిన పదో తరగతి విద్యార్థుల కోసం సత్తుపల్లి మండలం కిష్టారం ఉపాధ్యాయుడు సయ్యద్ సమద్ రూపొందించిన ఫిజిక్స్ మెటీరియల్‌ను డీఈఓ సోమశేఖర శర్మ బుధవారం తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భౌతిక, రసాయన శాస్త్ర పరీక్షల్లో అత్యధిక సంఖ్యలో ఉత్తీర్ణత సాధించడానికి ముఖ్యమైన ప్రశ్నలను, ఇతర విద్యార్థులకు బహుళ ఆలోచన కలిగించే ప్రశ్నలను తెలుగు, ఇంగ్లిష్ మీడియాల్లో సమాధానాలతో సహా రూపొందించడం అభినందనీయమని అన్నారు. ప్రతి పాఠశాలలో ఈ పుస్తకం అందుబాటులో ఉంచాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు మోత్కూరు మధు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు, నాయకులు చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు.

విజేత జట్టుకు ట్రోఫీ అందజేస్తున్న కలెక్టర్

మిరప పంటను పరిశీలిస్తున్న విజయనిర్మల