దాడికి గురైన ఇంటిని చూసి కంటతడి

MLA Akhanda Srinivasamurthy Turns Emotional During His House Visit - Sakshi

ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణకు డిమాండ్‌

బెంగళూర్‌ : కర్ణాటక రాజధాని బెంగళూరులో అల్లరి మూకలు ధ్వంసం చేసిన తన నివాసాన్ని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ‘అ‍ల్లరిమూకల దాడిలో విలువైన వస్తువులన్నీ కోల్పోయాను..నా ఇంటిని ధగ్ధం చేశారు..నాకు ఏమీ అవసరం లేదు..నా తల్లి మంగళసూత్రం ఎవరికైనా కనిపిస్తే దయచేసి దాన్ని తిరిగి ఇచ్చేయండ’ని ఆయన విజ్ఞప్తి చేశారు. సోషల్‌ మీడియాలో ఎమ్మెల్యే బంధువు ఓ వర్గానికి వ్యతిరేకంగా పోస్ట్‌ చేయడంతో ఆందోళనకారులు రెండు రోజుల కిందట ఆయన ఇంటిపై దాడిచేసిన సంగతి తెలిసిందే. అల్లర్ల కారణంగా ముగ్గురు మరణించగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఇక ఎమ్మెల్యే తన భార్య, పిల్లలతో తమ ఇంటి వద్దకు రాగా, పెద్దసంఖ్యలో ఆయన మద్దతుదారులు మూర్తి ఇంటివద్ద గుమికూడారు. కాగా ఇంటి ఆవరణలో మంగళసూత్రం కనిపించడంతో తిరిగి ఎమ్మెల్యేకు అందచేశారు. ఆయన పిల్లలు, మేనల్లుళ్లు, మేనకోడళ్ల మార్కుల కార్డులు కాలిబూడిదవడంతో వారు తీవ్రంగా కలత చెందారు. ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తితో పాటు ఆయన సోదరులు సైతం పూర్వీకుల నుంచి వచ్చిన అదే ఇంటిలో నివసిస్తున్నారు. ఇది పథకం ప్రకారం జరిగిన దాడిగా శ్రీనివాసమూర్తి ఆరోపించారు.

ఎవరో చేసిన పొరపాటుకు తన ఇంటిపై ఎందుకు దాడి చేశారో అర్ధం కావడంలేదని, తన ఇంటిని దగ్ధం చేసిన వారికి తాను ఏం హాని చేశానని ప్రశ్నించారు. తన భార్యకు, పిల్లలకు హాని జరిగితే బాధ్యత ఎవరిదని ఆయన నిలదీశారు. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ చేపట్టాలని ఆయన కోరారు. కాగా బెంగళూరు అల్లర్లకు సంబంధించి ఇప్పటికి ఐదుగురిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మరోవైపు తన ఇంటిపై అల్లరి మూకల దాడి గురించి ఆయన డీజే హళ్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాను సురక్షిత ప్రాంతంలో ఉండటంతో పాటు నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నందున ఫిర్యాదులో జాప్యం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చదవండి : భగ్గుమన్న బెంగళూరు!

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top