ముగింపెప్పుడో?
అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే అరవ శ్రీధర్
కుంటుపడుతున్న అధికారిక కార్యక్రమాలు
ఎమ్మెల్యే విషయంలో కొత్త కోణాలు
పోలీసులు ఎంక్వైరీ సక్రమంగా సాగేనా?
ఇంత వరకు ఖండించని స్థానిక పార్టీ, నియోజకవర్గ ఇన్‌చార్జ్
దేశంలో నాడు స్త్రీకి ఉన్నత గౌరవం ఉండేది. ఆమెను దేవతతో సమానంగా చూసేవారు. నేడు బాబు సర్కారులో ఓ మహిళ హోమ్ మంత్రిగా ఉండి కూడా అతివలకు రక్షణ కరువైంది. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులే ఆమెను చెరబడుతున్నారు. అందుకు నిదర్శనం మూడు రోజుల కిందట వెలుగులోకి వచ్చిన అరవ శ్రీధర్ కీచకపర్వమే. ఆ ఒక్కటితో ఆగలేదు ఆయనగారి రాసలీలలు. ఆయన కీచక పర్వం రోజుకొక వీడియోతో కొనసాగుతోంది. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన రాసలీలలు ఇంకెన్ని బయట పడతాయోనని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.
రైల్వేకోడూరు అర్బన్: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఓ మహిళా ఉద్యోగితో జరిపిన కీచక పర్వం వీడియో లీకులు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. బాధితురాలు రోజుకొక లీకులు సోషల్ మీడియా ద్వారా పోస్టు చేస్తున్నారు. నియోజకవర్గమంతా ఇంకా ఎన్ని కొత్త వీడియోలు వస్తాయో? అనే చర్చే కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా నియోజక వర్గంలో ఇదే చర్చనీయాంశంగా మారింది. బాధిత మహిళ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిశాక సీను మొత్తం రివర్స్ కావడంతో టీవీ చానళ్ల ద్వారా జరిగిన విషయాలను బయట పెట్టి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నిజ స్వరూపం బయట పెట్టింది.
ఈ మధ్యలో జనసేన నాయకుడు, మరి కొందరూ మంతనాలు జరిపినట్లు తెలిసింది. అయితే బాధితురాలికి నమ్మకం లేక పోవకోవడంతో ఎమ్మెల్యేకి తనకు మధ్యలో జరిగిన విషయాలను బహిర్గతం చేసింది. మూడు రోజులుగా ఫేస్‌బుక్ సోషల్ మీడియా ద్వారా రోజుకొటి రెండు వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్న వీడియోలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి. కొత్తగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒంటరిగా కారు తోలుతూ బాధిత మహిళకు వీడియోకాల్ చేసి ‘నువ్వు వద్దంటే చచ్చిపోతాను.. నువ్వు లేకుండా నేను ఉండలేను’ అంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసిన వీడియో హల్‌చల్ చేస్తోంది. కొత్త కోణంలో ఈ చిత్రాలు ఇంకా ఎన్ని ఉన్నాయోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.
పోలీసులు ఎంక్వైరీ సక్రమంగా సాగేనా?
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తల్లి ప్రమీలమ్మ తన కొడుకుని, తమ కుటుంబ సభ్యులను ఆ మహిళా ఉద్యోగి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, రూ.25 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపణలు చేస్తూ బాధిత మహిళపై రైల్వేకోడూరులో పోలీసులకు ఈనెల 7వ తేదీన ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐ చంద్రశేఖర్ ఆరోపిస్తున్న మహిళపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. విచారణ ప్రారంభించామని చెబుతున్నారు. త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయని తెలిపారు. ఆమె అందుబాటులో లేదని, నోటీసు ఇచ్చి విచారణ చేస్తామని, దీనికి తోడు మరో కేసు నమోదు చేసామన్నారు. ఇదిలా ఉండగా జిల్లా పోలీసులకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై ఇంతవరకు కేసు నమోదు కాలేదు. ఏకపక్షంగా ఎంక్వయిరీ జరిగేలా నాయకులు పైరవీలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
అజ్ఞాతంలోకి అరవ శ్రీధర్
ఈవిషయం జరిగిన మరుక్షణం నుంచి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అజ్ఞాతంలోని వెళ్లారు. మరుసటి రోజు ఆ వీడియోలకు తనవి కావని చట్టరీత్యా నిరూపించుకుంటానని ఎక్కడో ఉండి వివరణ ఇచ్చాడు. అంతేకాని మూడురోజులవుతున్నా ఎవరికీ అతని జాడ తెలియలేదు. ఎవరితోనూ సంప్రదించలేదని తెలిసింది. ఎమ్మెల్యే నియోజకవర్గంలో లేకపోవడంతో అధికారిక కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆటంకం ఏర్పడుతోంది. ఎమ్మెల్యే అయ్యి ఉండి అతను బహిరంగంగా ప్రజలకు ఎం జవాబు చెబుతాడోనని ఉత్కంఠగా పలువురు ఎదురు చూస్తున్నారు.

ఇంత వరకు ఖండించని స్థానిక పార్టీ, నియోజకవర్గ ఇన్‌చార్జ్
ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలు, వీడియోలపై ఇంతవరకు, జనసేన పారీ్టకాని, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గానీ ఖండించలేదు. ఎవరికీ వారు తమ పనులు చేసుకుంటూ విషయం ఎవరికీ తెలీదన్నట్లు ఉన్నారు. ఎమ్మల్యే అరవ శ్రీధర్‌ను అన్నీ తానై గెలిపించిన టీడీపీ ఇన్‌చార్జ్ ముక్కా రూపానందరెడ్డి ఈ తతంగంపై మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు.


