ఎట్టకేలకు గ్రామానికి ఎర్ర బస్సు | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు గ్రామానికి ఎర్ర బస్సు

Nov 18 2026 1:44 AM | Updated on Nov 18 2026 1:44 AM

రాయచూరు రూరల్‌: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్లకు మారుమూల గ్రామానికి ఎర్ర బస్సు వచ్చిన ఘటన రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. మంగళవారం సింధనూరు తాలూకా ఈరణ్ణ క్యాంపునకు ఎన్‌ఈకేఆర్టీసీ బస్సు సర్వీసుకు సుడా అధ్యక్షుడు బాపూగౌడ శ్రీకారం చుట్టారు. గ్రామస్తులు బస్సుకు పూలమాలలతో అలంకరించి ముస్తాబు చేశారు. ఈరణ్ణ క్యాంపు, తాతప్ప క్యాంపు విద్యార్థులకు, ప్రజలకు అనుకూలమయ్యే విధంగా బస్సు సౌకర్యాన్ని కల్పించారు.

రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి

● తనయుడికి తీవ్ర గాయాలు

● బైక్‌కు గుర్తు తెలియని వాహనం ఢీ

బళ్లారి రూరల్‌: బళ్లారి జిల్లా తోరణగల్లు సమీపంలో భైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తల్లి మృతి చెందగా తనయుడు తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. తోరణగల్లు పోలీసులు తెలిపిన వివరాలు.. దొడ్డ అంతాపురకు చెందిన హనుమక్క (60), తన కొడుకు హనుమంతు (35) బైక్‌పై సోమవారం సాయంత్రం తోరణగల్లు వైపు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. దీంతో హనుమక్క అక్కడికక్కడే మృతి చెందగా హనుమంతు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి గాయపడిన హనుమంతును ట్రామాకేర్‌ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి తోరణగల్లు పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని బీఎంసీఆర్‌సీ మార్చురీకి తరలించారు. కాగా హనుమంతు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు.

శిలామూర్తులకు ప్రత్యేక పూజలు

రాయచూరు రూరల్‌: కార్తీక మాసం సందర్భంగా పాలమ్మ దేవాలయంలో నూతన శిలా మూర్తులకు పూజలను నిర్వహించారు. మంగళవారం ిసిరవార తాలూకా జక్కలదిన్నిలో వెలసిన పాలమ్మ దేవాలయంలో జోడు నాగదేవత, నందీశ్వర, ధ్వజస్తంభ ప్రతిష్టాపనలకు కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య పూజలు చేశారు. అభిషేకం, కుంకుమార్చన, పుష్పార్చన, మహా మంగళ హారతిలను నెరవేర్చారు.

ఆర్థికాభివృద్ధిలో సహకారం అధికం

రాయచూరు రూరల్‌: ప్రజల సామాజిక, ఆర్థిక సమానత్వం మెరుగుదలలో సహకార సంఘాల పాత్ర అధికమని సహకార మండలి అధ్యక్షుడు విజయ కుమార్‌ పాటిల్‌ అభిప్రాయ పడ్డారు. మంగళవారం రాయచూరులోని ఆర్‌ఏపీఎంసీ భవనంలో 73వ అఖిల భారత రాష్ట్ర స్థాయి సహకార ఉత్సవాలకు ఆయన శ్రీకారం చుట్టి మాట్లాడారు. సామాజిక భద్రతకు పునాది రాయి లాంటి సహకార వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. జయంతి రావ్‌ పతంగి, మనోహర్‌, బసవరాజ్‌, శశిధర్‌ పాటిల్‌, మల్లనగౌడ, శరణప్ప, ఉమేష్‌, శంకర రెడ్డి, భీమిరెడ్డిలున్నారు.

ఫార్మసిస్టుల సేవలు అమోఘం

రాయచూరు రూరల్‌: వైద్య రంగంలో ఫార్మసిస్టుల సేవలు అమోఘమని రాష్ట మెడికల్‌ సైన్స్‌ పరిషత్‌ వైస్‌ చాన్సలర్‌ శిరసే క్రాంతి కుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం నవోదయ ఫార్మసీ వైద్య కళాశాలలో జరిగిన రాష్ట్ర మెడికల్‌ సైన్స్‌ పరిషత్‌లో విద్యార్థులనుద్దేశించి ఆన్‌లైన్‌లో నూతనంగా నమోదు, విదేశాలకు ఎగుమతి, దిగుమతి ప్రక్రియల గురించి మాట్లాడారు. రోగులకు, ఔషధాలకు మధ్య అనుబంధంగా పని చేసే ఫార్మసిస్టుల వైద్య సేవలు విస్తరించాలన్నారు. నవోదయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ దొడ్డయ్య, సురేష్‌ బాబు, రామ్‌ మోహన్‌ గుప్త, ప్రాధ్యా పాటిల్‌, అపర్ణ, లక్ష్మి, రోహిత్‌, ఆదిత్య కల్యాణకర్‌లు పాల్గొన్నారు.

మూడో రోజు రైతుల పాదయాత్ర

రాయచూరు రూరల్‌: కళ్యాణ కర్ణాటకలోని రాయచూరు, లింగసూగూరు, దేవదుర్గ తాలూకాల్లో నారాయణపుర కుడి కాలువకు నిరంతరం నీటిని విడుదల చేయాలని కర్ణాటక రైతు సంఘం వ్యవసాయ సేన అభివృద్ధి సేన ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్ర మూడో రోజు కొనసాగింది. మంగళవారం తింథిణి వంతెన వద్ద నుంచి ప్రారంభమైన పాదయాత్ర నారాయణపుర డ్యాం దిశగా సాగింది. ఎన్‌ఆర్‌బీసీ కాలువలకు వారబందీ పద్ధతికి స్వస్తి పలికి నిరంతరం నీటిని విడుదల చేయాలన్నారు. కాలువ ఆయకట్టు చివరి భూములకు నీరందక వేలాది హెక్టార్లలో పంటలు వాడుముఖం పడుతున్నాయన్నారు. నవంబర్‌ 30 వరకు నీరు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement