23న కనకదుర్గమ్మ గుడిలో హుండీ లెక్కింపు | - | Sakshi
Sakshi News home page

23న కనకదుర్గమ్మ గుడిలో హుండీ లెక్కింపు

Nov 18 2026 1:44 AM | Updated on Nov 18 2026 1:44 AM

బళ్లారిటౌన్‌: నగరంలో ప్రసిద్ధి చెందిన కనకదుర్గమ్మ దేవస్థానం హుండీ లెక్కింపును ఈ నెల 23న ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు హిందూ ధార్మిక సంస్థ ధర్మదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు నిర్వహించే ఈ లెక్కింపు కార్యక్రమం తహసీల్దార్‌ పర్యవేక్షణ, దేవస్థాన కార్యనిర్వహణాధికారి పాల్గొంటారని తెలిపారు. హుండీ లెక్కింపు పూర్తి పారదర్శకంగా జరిగేందుకు రెవెన్యూ శాఖ, పోలీస్‌ సిబ్బంది, బ్యాంక్‌ సిబ్బంది, గ్రామ పరిపాలన అధికారులు, సహాయకుల సమక్షంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే నిబంధనల ప్రకారం హుండీ లెక్కింపుకు వీడియో చిత్రీకరణ చేయాలని సూచించారు. లెక్కింపు పూర్తయిన వెంటనే డబ్బులు దేవస్థానం పొదుపు ఖాతాలో జమ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు.

కారు, బైక్‌ ఢీ..

బైక్‌ చోదకుడు మృతి

హుబ్లీ: కారు, బైక్‌ మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌ చోదకుడు అక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి ధార్వాడ జిల్లాలోని అళ్నావర తాలూకా కడపగట్టి గ్రామ శివారు ధార్వాడ– గోవా రోడ్డులో జరిగింది. హుబ్లీ గ్రామ సుళ్ల గ్రామ నివాసి దయానంద (25) మృతుడు. అళ్నావర నుంచి ధార్వాడ వైపు వెళుతూ ఎదురుగా వస్తున్న కారును ఢీకొన్నాడు. ప్రమాద తీవ్రతకు దయానంద అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌ వెనుక కూర్చొన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అళ్నావర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

కాలువలోకి ట్రాక్టర్‌ బోల్తా

● త్రుటిలో తప్పిన పెను ప్రమాదం.!

● కూలికార్మికులందరూ సురక్షితం

హొసపేటె: చెరకు కోత పనుల కోసం కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్‌ ఒక్కసారిగా కాలువలోకి బోల్తాపడింది. ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న సుమారు 15 మంది కూలీలు ప్రమాదంలో చిక్కుకున్నప్పటికీ అదృష్టవశాత్తు అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన విజయనగర జిల్లా హొసపేటె తాలూకాలోని మలపనగుడి తాండా సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బళ్లారి జిల్లా కడ్డిరాంపుర తాండాకు చెందిన కూలీలను చెరకు కోత పనుల కోసం ట్రాక్టర్‌లో తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో మలపనగుడి తాండా సమీపంలోని కాలువపై ఉన్న దారిలో ట్రాక్టర్‌ ప్రయాణిస్తుండగా రోడ్డుపై ఉన్న హంప్స్‌ దాటే సమయంలో ట్రాక్టర్‌ ఇంజిన్‌తో పాటు ట్రాలీ కూడా అదుపు తప్పి కాలువలోకి బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లోని కూలీలు ప్రమాదంలో చిక్కుకున్నా అదృష్టవశాత్తు అందరూ సురక్షితంగా బయటపడటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఆలయంలో హుండీ చోరీ

హుబ్లీ: స్థానిక మంజునాథ నగర చివరి బస్టాండ్‌ దగ్గర ఉన్న హనుమంత ఆలయంలోని కానుకల హుండీలో ఉన్న రూ.80 వేల నగదును దుండగులు చోరీ చేశారు. ఆలయానికి వేసిన తలుపు తాళాన్ని పగలగొట్టి లోపలకు వెళ్లిన దొంగలు హుండీకి వేసిన తాళాన్ని విరగగొట్టి కానుకలను చోరీ చేశారని గోకుల్‌ రోడ్డు స్టేషన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

మఠం కార్యాలయంలో..

మరో ఘటనలో కార్యాలయంలో చోరీ జరిగింది. తాలూకాలోని పాలెగ్రామం జాతీయ రహదారిలోని వజ్రహస్త మఠం కార్యాలయం తలుపులు బద్దలుగొట్టి లోపలకు వెళ్లిన దొంగలు అక్కడ ఉన్న రూ.1.48 లక్షల విలువ చేసే వెండి, బంగారు ఆభరణాలను చోరీ చేసినట్లు హుబ్లీ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

28 నుంచి తిరుమల తిరుపతి పాదయాత్ర

హుబ్లీ: తిరుమల తిరుపతి పాదయాత్ర సేవా సంస్థ ఈ నెల 28 నుంచి తిరుమల తిరుపతి పాదయాత్ర చేపట్టనుందని ఆ సంస్థ నిర్వాహకులు మంజునాథ్‌ కిరేసూర మీడియాకు తెలిపారు. ఆ రోజు ఉదయం 5 గంటలకు ఉణకల్‌ క్రాస్‌ వెంకటాద్రి హార్డ్స్‌ కాంప్లెక్స్‌ ఎదురుగా ఉన్న రామలింగేశ్వర దేవస్థానం నుంచి 6వ ఏడాది జరిగే ఈ పాదయాత్రకు శ్రీకారం చుడతామన్నారు. వైకుంఠ ఏకాదశి శుభవేళ నేపథ్యంలో ఈ పాదయాత్ర చేపట్టామని, యాత్రలో పాల్గొనగోరు భక్తులు ఎవరైనా ఈ నెల 22 లోగా పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. సదరు భక్తులకు టిఫిన్‌, భోజనం, వాహన వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులు ఏ వయసు వారైనా ఆసక్తి ఉంటే తమ దినసరి ఔషధాలు, దుస్తులు, దుప్పట్లతో రావాలని ఆయన సూచించారు. వివరాలకు నిర్వాహకుల సమితిని సంప్రదించాలని ఆయన కోరారు. నారాయణ రెడ్డి కిరేసూర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement