రైళ్లలో చోరీలు.. నిందితుడి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

రైళ్లలో చోరీలు.. నిందితుడి అరెస్టు

Nov 18 2026 1:44 AM | Updated on Nov 18 2026 1:44 AM

గుంతకల్లు: రైళ్లలో ప్రయాణికుల విలువైన వస్తువులు, సెల్‌ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాలో ఒక వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు గుంతకల్లు జీఆర్‌పీ సీఐ అజయ్‌కుమార్‌ తెలిపారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం గుంతకల్లు రైల్వేస్టేషన్‌లోని జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్‌లో ఆదోని ఆర్‌పీఎఫ్‌ అధికారులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అక్టోబర్‌ 31న ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన గుల్బర్గాకు చెందిన కాంచన అనే మహిళ తన హ్యాండ్‌ బ్యాగ్‌ చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశారన్నారు. ఆ బ్యాగులో 8.2 తులాల బంగారు ఆభరణాలతో పాటు సెల్‌ఫోన్‌ ఉందన్నారు. అదేవిధంగా నవంబర్‌ 06, 11 తేదీల్లో మరో ఇద్దరు ప్రయాణికులు తమ సెల్‌ఫోన్లు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశారన్నారు. వరుస చోరీల నేపథ్యంలో ఆదోని, గుంతకల్లు ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది, గుంతకల్లు జీఆర్‌పీ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారన్నారు. మంగళవారం ఉదయం రైల్వేస్టేషన్‌ ప్రాంగణం వెలుపల అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురిని గుర్తించి పట్టుకునేందుకు యత్నించగా, ఇద్దరు పరారయ్యారని, ఒకరిని మాత్రమే పట్టుకోగలిగామని చెప్పారు. పట్టుబడిన నిందితుడిని గుంతకల్లుకు చెందిన ప్రసంగి అలియాస్‌ లిక్కి అలియాస్‌ వెంకీగా గుర్తించినట్లు వెల్లడించారు. గుల్బర్గాకు చెందిన కాంచన హ్యాండ్‌ బ్యాగ్‌ చోరీతో పాటు సెల్‌ఫోన్ల చోరీ కేసుల్లోనూ ఇతని ప్రమేయం ఉన్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. లక్కీ, మరో ఇద్దరు ముఠాగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. తాడిపత్రిలో అపాచీ ద్విచక్ర వాహనాన్ని కూడా ఈ ముఠా దొంగిలించిందన్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు సీఐ పేర్కొన్నారు. రైళ్లలో ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైలు ప్రయాణంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే 139 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఆర్‌పీఎఫ్‌ క్రైం ఇన్‌స్పెక్టర్‌ కుమార్‌, జీఆర్‌పీ ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement