బళ్లారి రూరల్: దావణగెరె నగరంతో పాటు జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్‌హోంల్లో సిజేరియన్ కాన్పులు తగ్గేలా ఆరోగ్యాధికారులు చర్యలు తీసుకోవాలని దావణగెరె ఎంపీ డాక్టర్ ప్రభా మల్లికార్జున సూచించారు. మంగళవారం హొన్నాళి తాలూకా అరబగట్టిలోని ఇందిరాగాంధి వసతి పాఠశాలలో జిల్లా అభివృద్ధి సమన్వయ సమితి, దిశా సమితి పరిశీలన సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. తప్పనిసరి పరిస్థితిలో తప్ప సిజేరియన్ కాన్పులు చేయకుండా ఆరోగ్యాధికారులు తనిఖీ చేపట్టాలన్నారు. సాధారణ కాన్పులు నిర్వహించి మహిళల ఆరోగ్యాలను కాపాడాలన్నారు. జిల్లా ఆసుపత్రిలోని ల్యాబ్ రిపోర్టులు, బయట ల్యాబ్‌లో రిపోర్టుల మధ్య వ్యత్యాసం ఉన్నట్లు ప్రజలు ఆరోపిస్తున్న నేపథ్యంలో అధికారులు పరిశీలన నిర్వహించాలన్నారు. నగరంలో విద్యార్థుల ట్రిపుల్ రైడింగ్‌లను పోలీసుశాఖ అరికట్టాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల వద్ద డ్రగ్స్, గంజాయి దందాలను అరికట్టాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అభివృద్ధిని, ప్రగతిని అధికారులు వివరించారు. జిల్లాధికారి జీ.ఎం. గంగాధరస్వామి, జడ్పీ సీఈఓ ఎం.సాహిత్య, ఎస్పీ పరమేశ్వర హెగ్డే, డీఎఫ్‌ఓ హర్షవర్ధన్, వివిధ శాఖాధికారులు పాల్గొన్నారు.
డ్రగ్స్, గంజాయి దందాలను అరికట్టండి
అధికారులకు ఎంపీ డాక్టర్ ప్రభా సూచన


