బళ్లారి అర్బన్: భగవద్గీత ఉపనిషత్తుల సారమని, వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువల పెంపు, సామాజిక సామరస్యం, జాతీయ ఐక్యత సాధనలో భగవద్గీత కీలక పాత్ర పోషిస్తుందని సోండా స్వర్ణవల్లి మహా సంస్థానానికి చెందిన శ్రీమద్ గంగాధరేంద్ర సరస్వతి మహాస్వామి అన్నారు. శ్రీ భగవద్గీత అభియాన్ కర్ణాటక, శ్రీ సర్వజ్ఞేంద్ర సరస్వతి ప్రతిష్ఠాన్, శ్రీ సోండా స్వర్ణవల్లి మహాసంస్థాన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం బళ్లారిలోని సంగనకల్లు రోడ్డులో ఉన్న శ్రీ శంకరమఠంలో భగవద్గీత అభియాన్–2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్వామిజీ భక్తులకు ఆశీర్వచనం అందించారు. సుమారు 18 ఏళ్ల క్రితం బళ్లారి జిల్లాలో తొలిసారిగా ప్రారంభమైన భగవద్గీత ప్రచార కార్యక్రమాన్ని ప్రస్తుతం నూతన కార్యక్రమాలతో తిరిగి ప్రారంభించడం సంతోషకరమన్నారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతాబోధన చేయడం ద్వారా యావత్ ప్రపంచానికి గొప్ప సందేశాన్ని అందించారని తెలిపారు. మోహన్ భట్, గురుపాద హెగ్డే, శంకరమఠం ధర్మదర్శులు నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.


