కర్ణాటెక్‌ ముద్ర | - | Sakshi
Sakshi News home page

కర్ణాటెక్‌ ముద్ర

Nov 18 2026 1:44 AM | Updated on Nov 18 2026 1:44 AM

శివాజీనగర: కర్ణాటక 2025–26 ఆర్థిక సంవత్సరం మొదటి భాగంలో 9.4 బిలియన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించింది. ఇది దేశ మొత్తం ఎఫ్‌డీఐలో 26 శాతానికి సమానమని సీఎం డీ.కే.శివకుమార్‌ తెలిపారు. మంగళవారం బెంగళూరు ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో 29వ బెంగళూరు టెక్‌ సమ్మిట్‌ను ప్రారంభించి మాట్లాడారు. స్టార్టప్‌లు, పరిశోధనలు, పశ్రమలకు ఒకే వేదికను అందించడానికి ఒక ఏఐ హబ్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

రాజధానిలో రోబోటిక్స్‌, ఏఐ జోన్‌

రాయచూరులోని ఐఐఐటీలో ఒక సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను నెలకొల్పుతామని సీఎం తెలిపారు. బెంగళూరులోని రోబోటిక్స్‌– ఏఐ ఇన్నోవేషన్‌ జోన్‌ను ఏర్పాటుకు ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. సెమి కండక్టర్‌ రంగంలో కూడా కర్ణాటక అగ్రగామి అన్నారు.

బెంగళూరు, మైసూరులో పరిశోధన, తయారీ యూనిట్ల స్థాపనకు ప్రపంచ కంపెనీలు రూ.23 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. ధార్వాడ నుంచి మైసూరు వరకు నాలుగు ఎలక్ట్రానిక్స్‌ తయారీ క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

రాష్ట్ర బయో టెక్నాలజీ ఆర్థిక రంగం 39 బిలియన్‌ డాలర్లుగా ఉందన్నారు. బీటీ, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని చెప్పారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలు, సంస్థలను కోరారు. కాగా, సదస్సులో ఏఐ, డీప్‌టెక్‌, బీటీ, హెల్త్‌కేర్‌, రోబోటిక్స్‌ రంగాల ఆవిష్కరణలను చాటే స్టాల్స్‌ ఏర్పాటయ్యాయి. 75కు పైగా దేశాల నుంచి వాణిజ్య ప్రతినిధులు పాల్గొన్నారు. విదేశీ ప్రతినిధులు, విద్యార్థులతో సందడి నెలకొంది. రోబో జీవుల ప్రదర్శన అబ్బురపరచింది.

ఐటీ, విదేశీ పెట్టుబడుల్లో మేటి

బెంగళూరు టెక్‌ సమ్మిట్‌లో సీఎం డీకే

నూతన ఏఐ, ఐటీ పథకాల వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement