బనశంకరి: మహిళలు ప్రజాస్వామ్యంలో భాగం మాత్రమే కాకుండా చట్టాల తయారీ, నిర్ణయాలు తీసుకోవడంలోనూ నాయకత్వం వహించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. మంగళవారం విధానసౌధలో రెండురోజుల కామన్‌వెల్త్ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సును స్పీకర్ ఓం బిర్లా, సీఎం డీకే శివకుమార్ ప్రారంభించారు. ఓం బిర్లా ప్రసంగిస్తూ 12వ శతాబ్దంలో కర్ణాటకలో జగజ్యోతి బసవేశ్వర నేతృత్వంలో రూపుదిద్దుకున్న అనుభవ మంటపం సమానత్వం, చర్చకు నాంది పలికిందన్నారు. కిత్తూరు రాణిచెన్నమ్మ, ఝూన్సీరాణి లక్ష్మీబాయి లాంటి వీరమహిళలు దేశచరిత్రలో దీటైన నాయకత్వం వహించారని తెలిపారు. నేడు విద్య, విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ, అంతరిక్ష పరిజ్ఞానంతో పాటు అన్నిరంగాల్లో మహిళలు ముందంజలో ఉన్నారని చెప్పారు. డిప్యూటీ సీఎం పరమేశ్వర్ మాట్లాడుతూ అసెంబ్లీ, పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
సురక్షిత వాతావరణం కావాలి: పురందేశ్వరి
ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ప్రసంగిస్తూ వేగంగా విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ యుగంలో మహిళా ప్రజాప్రతినిధులకు సైబర్ వేధింపులు, అబద్ధపు ప్రచారంతో పరువుకు భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సవాళ్లతో మహిళలు రాజకీయాల్లోకి రావడానికి వెనుకాడే పరిస్థితి ఏర్పడరాదని తెలిపారు. నూతన మహిళా ప్రజాప్రతినిధులకు శిక్షణ, అనుభవజ్ఞులైన నాయకుల మార్గదర్శనం, మద్దతు కల్పించడం ప్రధానమని పేర్కొన్నారు.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పిలుపు
బెంగళూరులో
మహిళా పార్లమెంటేరియన్ల
సదస్సులో వెల్లివిరిసిన స్ఫూర్తి
విస్తృత చర్చలు
సదస్సుకు దేశం నలుమూలల నుంచి మహిళా ఎమ్మెల్యేలు, ఎంపీలు తరలివచ్చారు. పాల్గొన్న ప్రముఖులు, పలువురు మహిళా నాయకులు స్ఫూర్తిమంతమైన ప్రసంగాలతో ఉత్తేజం నింపారు. పలు అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగాయి. విధానసౌధ ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది.


