దొడ్డబళ్లాపురం: కారులోని ఒక వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు తుపాకీతో కాల్చి చంపిన సంఘటన బెంగళూరులో బూదిగెరె–బాగలూరు రోడ్డులోని మంచప్పనహళ్లి గేట్ వద్ద వెలుగుచూసింది. రోడ్డుపక్కన ఓ కారు నిలిపి ఉండడంతో స్థానికులు లోపలకు తొంగిచూడగా మృతదేహం కనిపించింది. తుపాకీతో కాల్చి హత్య చేసినట్టు ఖాళీ తూటాలు పడిఉన్నాయి. స్థానిక బాగలూరు పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు. మృతుని వయస్సు 35 ఏళ్లు ఉంటుందని తెలిపారు. మృతుని ఊరు, పేరు వివరాలు తెలియాల్సి ఉంది. ఈ హత్యతో స్థానికుల్లో గుబులు నెలకొంది.
కిలాడీ చిరుత.
బోను నుంచి పరారీ
మైసూరు: బోనులోకి చిక్కిన చిరుత బోనును కొరికి తప్పించుకున్న ఘటన జిల్లాలోని వరుణ నియోజకవర్గ మరసె గ్రామంలో జరిగింది. మరసె, మాకనహుండి గ్రామాల చుట్టుపక్కల చిరుతలు, పులుల సంచారం ఎక్కువగా ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఓ తోటలో దూడను ఉంచి బోనును పెట్టారు. ఓ చిరుత అందులో చిక్కుకుంది. అది దూకుడుగా కొరకడంతో బోను గొళ్లెం ఊడి తలుపు తెరచుకోవడంతో తప్పించుకుని పరారైంది. నాసిరకం బోను వల్లే ఇలా జరిగిందని ప్రజలు ఆరోపించారు.
సహజీవనంలో విషాదం
● ప్రేయసి వెళ్లిపోయిందని ప్రియుడు ఆత్మాహుతి
దొడ్డబళ్లాపురం: సహ జీవనం విషాదాంతంగా మారింది. మహిళ తనను వదిలేసి వెళ్లిపోయింనే బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా హనుమంతసాగర వద్ద జరిగింది. వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురానికి చెందిన పవన్ కుమార్ (29) తరచూ బెంగళూరుకు వస్తూ ఉండేవాడు. అతనికి నాగమణి అనే మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది. రెండేళ్ల క్రితం నాగమణి భర్త, పిల్లలను వదిలి పవన్‌తో వచ్చేసింది. ఇద్దరూ రాజానుకుంట చుట్టుపక్కల అద్దె ఇళ్లల్లో సహజీవనం చేయసాగారు. వారం క్రితం ఇద్దరికీ గొడవ జరిగి నాగమణి అతన్ని వదిలి వెళ్లిపోయి హనుమంతసాగరలో బంధువుల ఇంట్లో ఉంది. పవన్ ఆమె చిరునామాను కనుక్కుని వెళ్లి ఎంత ప్రాధేయపడినా రానని చెప్పేసింది. విరక్తి చెందిన పవన్ అక్కడే రోడ్డుపై ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్ర కాలిన గాయాలతో ఆర్తనాదాలు చేస్తూ పరుగులు తీయడంతో జనం భీతావహులయ్యారు. కొందరు ఆస్పత్రికి తరలించగా అక్కడ మరణించాడు. మాదనాయకనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
మహిళా మెడికోల హాస్టల్‌లో
దొంగల జోరు
మైసూరు: నగరంలోని మైసూరు మెడికల్ కాలేజీ మహిళా హాస్టల్‌లోకి చొరబడిన దొంగలు రూ.3.96 లక్షల విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. కేఆర్‌ఎస్ రోడ్డులోని పీకేటీబీ ఆస్పత్రి వద్ద ఉన్న హాస్టల్‌లోని 6,7వ నంబరు గదుల్లోకి చొరబడిన చోరులు 6 మొబైల్ ఫోన్లు, ఒక ఐపాడ్, ఒక లగ్జరీ వాచ్, కొంత నగదు, చీరలు, పాన్‌కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పవర్ బ్యాంక్, ఆధార్ కార్డులు, వెండి చైన్, స్కూటర్‌ను చోరీ చేసుకుని పరారయ్యారు. వాచ్‌మెన్ సంతోష్ సుస్తీగా ఉందని హాస్టల్ మెయిన్ డోర్‌ను లాక్ చేసి అక్కడే దిండు కింద తాళంచెవి, తన స్కూటర్ కీ, మొబైల్‌ను పెట్టి నిద్రించాడు. ఈ సమయంలో దొంగలు పడ్డారు. తమ మొబైళ్లు పోవడంతో విద్యార్థినులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వీవీపురం ఠాణాలో ఫిర్యాదు చేశారు.
త్వరలో టీచర్ పోస్టుల
భర్తీ: మంత్రి
శివమొగ్గ: రాఘవేంద్ర, విజయేంద్రలకు దమ్ముంటే వారి తండ్రి యడియూరప్ప గతంలో ఎందుకు జైలుకు వెళ్లారో ప్రజల ముందు చెప్పాలని రాష్ట్ర ప్రాథమిక విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప సవాల్ విసిరారు. ఆయన మంగళవారం నగరంలో తమ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ, సీఈటీ పరీక్షల తేదీలను రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తామని చెప్పారు. వచ్చే జూన్ నెల నుంచి కేపీఎస్ పాఠశాలలకు బస్సులను నడుపుతామన్నారు. పాఠశాలల్లో 13 లక్షల మంది విద్యార్థులున్నారని, ఆర్టీసీ బస్సులను నడిపితే అనుకూలమవుతుందన్నారు. శరావతి ప్రాజెక్టు బాధితులకు త్వరలోనే పరిహారం అందిస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ద్విభాషా మీడియం అమలు చేస్తామని మంత్రి తెలిపారు.


