హొసపేటె: వాహనాల అతివేగానికి అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. అభివృద్ధి పేరుతో నిర్మించిన జాతీయ రహదారే గ్రామస్తుల పాలిట మృత్యుపాశంగా మారుతోంది. సర్వీస్ రోడ్డు లేదు, పైవంతెన నిర్మాణం లేదు. కనీసం పొలాలకు వెళ్లాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రోడ్డు దాటాల్సిన దుస్థితి నెలకొంది. ఇదీ విజయనగర జిల్లాలోని జాతీయ రహదారి–50 పరిధిలోని దేవలాపుర, డణాయకనకెరె గ్రామాల ప్రజల దయనీయ పరిస్థితి. విజయనగర జిల్లా హొసపేటె తాలూకాలోని టీబీ డ్యాం నుంచి కూడ్లిగి తాలూకాలోని ఆలూరు వరకు విస్తరించిన జాతీయ రహదారి–50పై ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. ముఖ్యంగా మరియమ్మనహళ్లి పరిధిలో 2022 నుంచి 2025 వరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 100 మందికి పైగా మృత్యువాత పడ్డారని, 300 మందికి పైగా గాయపడ్డారని గణాంకాలు చెబుతున్నాయి. ప్రమాదాల్లో పలువురు శాశ్వత వైకల్యానికి కూడా గురయ్యారు. ముఖ్యంగా దేవలాపుర, డణాయకనకెరె గ్రామాల వద్ద రోడ్డు పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది.
పొలాలకు వెళ్లాలంటే రోడ్డు దాటాల్సిందే..
రైతులు తమ పొలాలకు వెళ్లాలంటే ఈ జాతీయ రహదారిని దాటాల్సిందే. ఎడ్లబండ్లు, ద్విచక్ర వాహనదారులు, పాఠశాల విద్యార్థులు, వృద్ధులు నిత్యం ప్రమాదాల మధ్యే ప్రయాణించాల్సి వస్తోంది. ఒక వైపు రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్న గ్రామస్తులు ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని భయాందోళనల మధ్య ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో తక్షణమే సర్వీస్ రోడ్డు నిర్మించడంతో పాటు పైవంతెన ఏర్పాటు చేయాలని గ్రామస్తులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు స్పందించి వెంటనే సర్వీస్ రోడ్డు, పైవంతెన నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో జాతీయ రహదారి–50ను దిగ్బంధించి పెద్ద ఎత్తు ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు.
రోడ్డు దాటడానికి కనీసం
సర్వీస్ రోడ్డు, పైవంతెనలు లేవు
ఇంకెన్ని ప్రాణాలు బలి అయితే
అధికారులకు కనువిప్పు కలుగుతుందో?


