హొసపేటె: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఐదు హామీ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు సరిగా చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా హామీ పథకాల అమలు కమిటీ చైర్మన్ కురి శివమూర్తి అన్నారు. బుధవారం నగరంలోని జిల్లాధికారి కార్యాలయంలో గ్యారంటీ పథకాల అమలు, పురోగతిని సమీక్షించేందుకు నిర్వహించిన సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. ప్రతి పథకం కింద అర్హులైన ఏ ఒక్క లబ్ధిదారుడూ సౌకర్యానికి దూరం కాకూడదన్నారు. తదుపరి సమావేశం నాటికి నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. నగరంలోని సెంట్రల్ బస్టాండ్‌లో పరిశుభ్రత కాపాడాలని సమితి సభ్యులు పేర్కొన్నారు. రాత్రిపూట ప్రజలు, ముఖ్యంగా మహిళల భద్రత కోసం సీసీ టీవీలను ఏర్పాటు చేయాలి. నగర పరిధిలో పట్టణ రవాణా వ్యవస్థకు అనుసంధానంగా మరిన్ని రవాణా సౌకర్యాలు కల్పించాలని వారు సమావేశంలో విజ్ఞప్తి చేశారు.
12.83 లక్షల మందికి ఆహార ధాన్యాలు
జిల్లాలో మొత్తం 3.36 లక్షల బీపీఎల్ కార్డుల ద్వారా 12.83 లక్షల మంది లబ్ధిదారులకు ఆహార ధాన్యాలు పంపిణీ చేసినట్లు ఆహార, పౌర సరఫరాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రియాజ్ తెలిపారు. గృహలక్ష్మి లబ్ధిదారులకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల వాయిదాలను కలిపి చెల్లించే ప్రక్రియ కొనసాగుతోందని మహిళా, శిశు అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ గంగప్ప సమావేశంలో తెలిపారు. గృహజ్యోతి పథకం కింద అర్హులైన లబ్ధిదారుల పునర్ సర్వే నిర్వహించామని జెస్కాం ఈఈ విష్ణు తెలిపారు. జెడ్పీ సీఈఓ గరీమా పన్వర్ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం అనధికార విద్యుత్ కనెక్షన్లపై చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో యువనిధి పథకం కింద మొత్తం 14,096 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, వారిలో 14,077 మంది లబ్ధిదారులకు డీబీటీ ద్వారా నేరుగా రూ.38.69 కోట్లు చెల్లించామన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి ఉద్యోగ మేళాలు అవసరం అని ఆమె సూచించారు.
జిల్లా పథకాల అమలు కమిటీ
చైర్మన్ కురి శివమూర్తి


