రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యా శాఖ మండలి సభ్యుడిగా రజాక్ ఉస్తాద్‌ను నియమిస్తూ ఆ శాఖ కార్యదర్శి విద్య మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. రజాక్ ఉస్తాద్‌తో పాటు బెంగళూరుకు చెందిన జయకృష్ణను 2029 వరకు మండలి సభ్యులుగా కొనసాగేలా ఆదేశాలు వెలువరించారు.
ధరల పెంపు తగదు
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆకస్మికంగా పెంచిన పాల ధరలను తగ్గించాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. బుధవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లాధ్యక్షుడు వీరేష్ మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపడంతో పేదలు, మధ్యతరగతి వర్గాలు నలిగిపోతున్నారని దుయ్యబట్టారు. పెంచిన పాల ధర, బస్ చార్జీల ధరలను విరమించుకోవాలని కోరుతూ స్థా నికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో శరణ బసవ, పద్మ, వరలక్ష్మిలున్నారు.
వైభవంగా సిద్దరామేశ్వర రథోత్సవం
రాయచూరు రూరల్: తాలూకాలోని చిక్కసూగూరులో సిద్దరామేశ్వర జాతర, రథోత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం చౌకిమఠం నుంచి ఆలయం వరకు మహిళలు కుంభ కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. వీరగాసె, నృత్యం చేస్తూ ఒడుపులు చెబుతూ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. సిద్దరామేశ్వర రథోత్సవాన్ని వందలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా నెరవేర్చారు. రథోత్సవం ముందు సిద్దలింగ మహాస్వామి, అభినవ రాచోటి శివాచార్యులు, మహాలింగ స్వామి, శిఖామణి అవదూత, వీరసిద్దస్వామి, విరుపాక్ష స్వామి తదితరులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.


