హబ్లీ: దీపావళి వేడుకల్లో రైతన్నకు విషాదం మిగిలింది. హుబ్లీ సమీపంలోని తిమ్మసాగరలో ఆకాశగుత్తి అనే బాణాసంచా అగ్నిప్రమాదానికి దారి తీసింది. కోతకు వచ్చిన చెరకు పంట పూర్తిగా బుగ్గిపాలై రూ.లక్షలాది మేర నష్టం వాటిల్లింది. కరువు పీడిస్తున్నా శ్రమించి పండించిన చెరకు పంట బుగ్గిపాలు కావడంతో రైతు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కాగా ఆకాశగుత్తి అనే బాణాసంచాను పేల్చరాదని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. తిమ్మసాగర రైతు శంకరలింగకు చెందిన మొత్తం 7 ఎకరాల చెరకు పంట మంటల్లో ఆహుతైంది. ఆకాశంలో స్కై లాంతర్ను పేల్చడం ద్వారా ఈ ప్రమాదం వాటిల్లింది. కాగా ప్రమాదవార్త తెలిసిన వెంటనే రైతన్న ముందుగా పరుగున వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. మరో వైపు అగ్నిమాపకదళం కూడా తమ శకటంతో వచ్చి మంటలను ఆర్పింది. రూ.లక్షలాది పంట చేతికందుతుందని నమ్మిన ఆ రైతన్నకు దీపావళి పండుగ విషాదాన్ని మిగిల్చింది.


