హొసపేటె: హూవినహడగలి పట్టణంలోని జీబీఆర్ కళాశాలలో 31 ఏళ్ల పాటు సేవలందించిన అతిథి ఉపన్యాసకుడిని ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విధుల నుంచి తొలగించడం వివాదానికి దారి తీసింది. కళాశాలలో చరిత్ర విభాగం అతిథి ఉపన్యాసకుడిగా పని చేస్తున్న శివప్రకాశ్ స్వామికి సెప్టెంబర్ 1న ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే విధుల నుంచి తొలగించారని ప్రగతిశీల సంఘాల నాయకులు ఆరోపించారు. సోమవారం జీబీఆర్ కళాశాల ఎదుట తాలూకా ప్రగతిశీల సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ ఆందోళనలో వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఉపన్యాసకుడికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 2026–27 విద్యా సంవత్సరంలోనూ నాలుగు నెలల పాటు విధులు నిర్వహించి వేతనం పొందినప్పటికీ.. ప్రస్తుతం హాజరు నమోదు చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా విధుల నుంచి తొలగించిన ఉత్తర్వుల ప్రతిని ఇవ్వకపోవడంతో పాటు, సేవా ధ్రువీకరణ పత్రం, హాజరు ధ్రువీకరణ పత్రాల కోసం కూడా తిప్పించకుంటున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై కళాశాల ప్రిన్సిపాల్‌కు వినతిపత్రం సమర్పించి 40 రోజులు గడిచినా ఎలాంటి స్పందన రాలేదన్నారు.
అర్ధాంతరంగా గెస్ట్ లెక్చరర్ తొలగింపు


