బళ్లారి అర్బన్: నగరంలోని వివిధ శివాలయాల్లో సోమవారం కార్తీక మాస పూజలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివెళ్లి స్వామిని దర్శించుకున్నారు. సత్యనారాయణ పేట బ్రిడ్జి సమీపంలోని కాశీ విశ్వేశ్వర ఆలయంలో అర్చకుడు శివలింగానికి పంచామృతాభిషేకం చేశారు. కోట మల్లేశ్వర స్వామి ఆలయం, పెద్ద మార్కెట్ నీలకంఠేశ్వర స్వామి ఆలయం, చిన్న మార్కెట్ మల్లికార్జున స్వామి ఆలయం, బాలాజీ నగర్ క్యాంపులోని అమృతేశ్వర స్వామి ఆలయంలో సందడి వాతావరణం నెలకొంది. పటేల్ నగర్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని శివాలయం, సత్యనారాయణపేట శనీశ్వర స్వామి ఆలయంలోని శివాలయం అనంతపురం రోడ్డులోని అభయ వరద ఆంజనేయ స్వామి ఆలయంలోని శివాలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. అభిషేకాలు, అర్చనలు, మహా మంగళహారతి అనంతరం భక్తులకు ప్రసాదం అందజేశారు. మహిళలు ఆలయాలు, ఇళ్ల ముందు కార్తీక దీపాలు వెలిగించారు.


