సైకో శేఖర్
ఆదివారం సాయంత్రం మైసూరు చాముండి కొండ వద్ద మృతదేహాల కోసం గాలింపు దృశ్యాలు
బనశంకరి: బెంగళూరు రాజాజీనగరలో పెను సంచలనం కలిగిస్తోన్న భార్య, ఆమె తల్లి, సోదరులు, వారి భార్య పిల్లలు.. మొత్తం 7 మందిని అతి కిరాతకంగా రుబ్బు బండతో బాది హతమార్చిన క్యాబ్‌డ్రైవర్ ఇందుశేఖర్ (54) కేసులో విచారణలో ఒక్కొక్కటే నిజాలు బయటపడుతున్నాయి. నిందితుడు ఇంగ్లీష్, మలయాళం క్రైమ్– థ్రిల్లర్ సినిమాలను చూసి ప్రభావితుడై హత్యాకాండకు నడుం బిగించాడని పోలీసు వర్గాలు తెలిపాయి.
పగ.. ప్రతీకారంతో దాడి
ఏవిధంగా వారిని హత్యచేసి, మృతదేహాలను తరలించిందీ పోలీసులకు విచారణలో ఇందుశేఖర్ వివరించినట్లు తెలిసింది. భార్య తన కంటే వయసులో చాలా చిన్నదని, చిన్నచూపు చూసేదని, ఆమె కుటుంబసభ్యులు కూడా వంత పాడేవారని కోపోద్రిక్తుడై ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపాడు. ఇంగ్లీష్, మలయాళంలోని సస్పెన్స్, క్రైమ్ సినిమాలు చూసి ప్రేరేపితుడయ్యాడు. ఇంటర్నెట్‌లో గాలించి హత్యలు ఎలా చేయాలి, మృతదేహాలను ఎలా తరలించాలి అనే విషయాలను తెలుసుకుని నరమేధానికి ఒడికట్డాడు.
చాముండి కొండల వద్ద గాలింపు
మైసూరు చాముండేశ్వరి దేవస్థానం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఇందుశేఖర్ బావమరిది శివకుమార్, దివ్య మృతదేహాలను ఆదివారం పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం 4:30 సమయంలో ఇందుశేఖర్ ను ఘటనా స్థలానికి తీసుకెళ్లి అతడు చెప్పినచోట గాలించగా శవాలు కనిపించాయి. అప్పటికే అక్కడ తీవ్ర దుర్వాసన వ్యాపించింది.
శవాలు ఎరుపుచీర, బెడ్‌షీట్‌లలో చుట్టి ఉన్నాయి. మృతదేహాలను మైసూరు మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి శవపరీక్షలు పూర్తిచేసి బంధువులకు అప్పగించారు. నందిబెట్టలో శుక్రవారం లభించిన బాలుడు పునీత్ మృతదేహానికి విక్టోరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం జరిపి ఆ సాయంత్రం అంత్యక్రియలు పూర్తిచేశారు. శని, ఆదివారం దొరికిన 4 మృతదేహాలకు ఒకే చోట బంధువులు అంత్యక్రియలు జరిపారు. దీంతో మొత్తం 7 మంది మృతదేహాలు దొరికినట్లయింది.
దుకాణాల సీసీ ఫుటేజీ సీజ్
నిందితుడు శేఖర్ మృతదేహాలను నింపడానికి సంచులను ఆర్‌ఎంసీ యార్డులో కొన్నాడని విచారణలో తెలిసింది. నిద్రమాత్రలు, తాడు, టేపు, కవర్లు, రసాయనిక వస్తువులను తన ఇంటి వద్ద భాష్యం సర్కిల్ చుట్టుపక్కల దుకాణాల్లో కొనుగోలు చేశాడు. పోలీసులు ఆయా అంగళ్ల సీసీ కెమెరాల చిత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
గతంలో సోదరుడు కూడా..
ఇందుశేఖర్, ఈ హత్యల్లో అతనికి అన్నివిధాలా సహకరించిన కుమార్తెను పోలీసులు విడివిడిగా విచారణ సాగిస్తున్నారు. అతని కుటుంబ చరిత్రపై దృష్టి సారించారు. గతంలో అతని సోదరుడు కూడా ఓ హత్య కేసులో జైలుపాలై అనారోగ్యంతో చనిపోయాడని గుర్తించారు.
బెంగళూరు కిల్లర్ ఇందుశేఖర్
విచారణలో వెల్లడి
మైసూరు చాముండి కొండ వద్ద రెండు మృతదేహాల వెలికితీత


