మైసూరు: కేరళ నుంచి మైసూరు వైపు వస్తున్న ఒక టెంపో వ్యాన్ మంటల్లో దగ్ధమైంది. ఈ సంఘటన జిల్లాలోని హుణసూరు తాలూకాలోని హరినహళ్లి గేట్ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగింది. కోజికోడ్ నుంచి మైసూరుకు పర్యాటకులతో వస్తున్న టీటీ వాహనం ఘటనాస్థలికి రాగానే పొగలు రావడం మొదలైంది. డ్రైవరు రోడ్డు పక్కన నిలిపి అందరినీ నిద్రలేపాడు. దీంతో అందరూ గబగబా దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ప్రయాణికుల కేకలు విన్న హరినహళ్లి గ్రామస్థులు అక్కడికి చేరుకుని ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు మంటలు ఆర్పేలోగా పూర్తిగా దగ్ధమైంది. ఓ బ్యాగులో ఉన్న మూడు మొబైల్ ఫోన్లు, బట్టలు, రూ. 15 వేల డబ్బులు కాలిపోయాయి.
కాటేసిన కట్న వేధింపులు
దొడ్డబళ్లాపురం: పెళ్లయిన 9 నెలలకే నవ వివాహిత వరకట్నం వేధింపులకు బలైన విషాద సంఘటన బెంగళూరు కోణనకుంటలో జరిగింది. శిరీషా (23) మృతురాలు. వివరాలు.. ఓ అపార్ట్‌మెంట్‌లో భర్త ప్రశాంత్, అత్త రుక్మిణితో కలిసి ఆమె నివసిస్తోంది. పుట్టింటి నుంచి మరింత వరకట్నం తేవాలని తమ కుమార్తెను వేధించేవారని శిరీషా తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో సోమవారం ఉదయం శిరీషా ఉరివేసుకున్న స్థితిలో ప్రాణాలు విడిచింది. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి మృతదేహాన్ని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
వీరభద్రుని రథ సంబరం
బొమ్మనహళ్లి: హావేరి నగరంలోని శ్రీ వీరభద్రేశ్వర దేవస్థానం జాతర మహోత్సవంలో భాగంగా ఆదివారం నేత్రపర్వంగా రథోత్సవం జరిగింది. తేరును సుందరంగా అలంకరించి అర్చకులు పూజలు చేశారు. తరువాత స్వామివారి ఉత్సవ విగ్రహాలను భాజా భజంత్రీల మధ్య తేరులో ఆసీనుల్ని చేశారు. వేలాది భక్తులు హర హర మహాదేవ... అని జపిస్తూ, దేవున్ని స్మరించుకుంటూ తేరును లాగారు. పలు వీధుల గుండా సాగింది, రోడ్లకు అటు ఇటు భక్తులు రథానికి పూజలు చేశారు.
స్టింగ్ కేసులో
కృపా ఆళ్వా విచారణ
శివాజీనగర: మాజీ సీఎం సిద్దరామయ్యపై సాగిన స్టింగ్ ఆపరేషన్ కేసులో ఆ పార్టీ బహిష్కృత నాయకురాలు కృపా ఆళ్వా బెంగళూరులోని సీసీబీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌తో రావాలని సూచించారు. హఠాత్తుగా విదేశాలకు వెళ్లిన ఆమె 7వ తేదీన రాత్రి తిరిగి వచ్చారు. విచారణ పూర్తయిన తరువాత మీతో మాట్లాడతానని విలేకరులతో అన్నారు. తాను ఇప్పటికి రెండుసార్లు డీసీపీకి వాంగ్మూలం ఇచ్చానని ఆమె తెలిపారు. విచారణ తరువాత ఆమె వెళ్లిపోయారు. స్టింగ్ కేసులో కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిద్దరామయ్య కుమారుడు, మంత్రి యతీంద్ర తరచూ డిమాండ్ చేయడం తెలిసిందే.
పోయిన బంగారం దొరికింది
శివమొగ్గ: రోడ్డు మీద దొరికిన బంగారు నగల బ్యాగును నిజాయితీగా సొంతదారుకు అప్పగించారు. ఈ అపురూప ఘటన శివమొగ్గ జిల్లాలోని సాగర్ తాలూకా కార్గల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కార్గల్ ఎస్‌ఐ శ్రీపతి గిన్ని, సిబ్బంది స్టేషన్ పరిధిలోని జోగ్ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో రోడ్డు పక్కన గుర్తుతెలియని బ్యాగ్ పడి ఉంది. దానిని పరిశీలించగా అందులో బంగారు నగలు, కొంత డబ్బు, విలువైన వస్తువులు, ఆధార్ కార్డు కనిపించాయి. పోలీసులు ఆధార్ కార్డులోని మొబైల్ నంబర్ ద్వారా ఫోన్ చేసి చెప్పారు. ఓ మహిళ ఆ సొత్తు తనదేనని తెలిపింది. బంగారు పోయిందని బాధలో ఉన్న ఆమె సొత్తు దొరకడంతో ఎంతో సంతోషించింది. ఎస్‌ఐ శ్రీపతి, పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.


