బనశంకరి: ఢామ్మని పేలే టపాసులు, రంగురంగుల చిచ్చుబుడ్లు, కాకర పువ్వొత్తులు.. ఇంకా అనేక రకాల బాణాసంచా చిటపటలు, ఇంట్లో బంధువుల సందడి, పిండివంటలతో ఆది, సోమవారం దీపావళి పర్వదినాన్ని సంతోషంగా ఆచరించారు. బెంగళూరుతో పాటు అన్నిచోట్లా టపాసుల పండుగ ఆనందంగా సాగింది. ఉదయం నుంచి లక్ష్మిపూజలను ఆచరించి సాయంత్రం నుంచి టపాసులను పేల్చారు. గృహ సముదాయాలు, షాపుల ముందు గుంపులుగా చేరి పటాకులు పేల్చారు. సోమవారం కూడా పండుగ సందడి కొనసాగింది. బెంగళూరులో పెద్ద ఎత్తున టపాసులు, మిఠాయిలు, పూలుపండ్ల వ్యాపారం సాగింది. ప్రధాన మార్కెట్లన్నీ కిక్కిరిశాయి. సోమవారం సైతం వీకెండ్ మాదిరిగా కనిపించింది.
పలుచోట్ల ప్రమాదాలు
రాష్ట్రంలో పలుచోట్ల టపాసులు కాలుస్తున్న సమయంలో ప్రమాదాలు సంభవించాయి. బెంగళూరు నగరంలోనే 42 మంది గాయపడ్డారు. వీరిలో 17 టపాసులు కాలుస్తూ గాయపడగా, మిగిలినవారు ఇతరులు పేల్చిన పటాసులు తగిలి గాయపడ్డారు. దొడ్డబళ్లాపురలో రాకెట్ పేలి బాలుని కంటికి తగలడంతో బెంగళూరు మింటో ఆసుపత్రిలో చేర్పించారు. కుడికంటి చూపు 80 శాతం కోల్పోయినట్లు డాక్టర్లు తెలిపారు. శస్త్రచికిత్స చేపట్టినప్పటికీ కంటి చూపు పూర్తిగా వచ్చే అవకాశం చాలా తక్కువగా వైద్యులు తెలిపారు. బాలుని తండ్రి శివశంకర్ మాట్లాడుతూ ఆదివారం రాత్రి రోడ్డుపైన ఆడుకుంటున్న సమయంలో రాకెట్ వచ్చి పడి పేలడంతో కుమారుడు గాయపడినట్లు తెలిపాడు. చేయని తప్పుకు కంటిని కోల్పోయాడని విలపించాడు. నారాయణ నేత్రాలయలో 22 మంది, మింటో ఆసుపత్రిలో 16 మంది, ప్రభా, శంకర ఆసుపత్రుల్లో ఇద్దరు వైద్యానికి వచ్చారు. కొందరిని అడ్మిట్ చేసుకోవాల్సి వచ్చింది.


