ఠాణాల్లోనే సివిల్ పంచాయితీలా?
బనశంకరి: రాష్ట్రంలో తమపై దౌర్జన్యాలు, హత్యలు పెచ్చుమీరడాన్ని ఖండిస్తూ, భద్రత కల్పించాలని న్యాయవాదులు గొంతెత్తారు. బెంగళూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం విధులను బహిష్కరించి ఆందోళనలు నిర్వహించారు. దీంతో కోర్టు విచారణలకు తీవ్ర ఆటంకం కలిగింది.
మా ప్రాణాలకు రక్షణ లేదా?
న్యాయవాదులకు వృత్తిపరమైన భద్రతకు సమర్థవంతమైన చట్టం రూపొందించాలని బెంగళూరు న్యాయవాదుల సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వేలాదిగా హైకోర్టు సహా అన్ని కోర్టుల నుంచి ర్యాలీ నిర్వహించి విధానసౌధకు చేరుకున్నారు. అక్కడ నినాదాలు చేస్తూ ధర్నా సాగించారు. ఇటీవల రోజుల్లో న్యాయవాదులపై పెరిగిన దాడులను ఉదాహరించారు. న్యాయాన్ని కాపాడడం కోసం పోరాడాల్సిన న్యాయవాదులు తమ ప్రాణరక్షణ కోసం వీధుల్లోకి రావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వైట్‌ఫీల్డ్ న్యాయవాది మంజునాథ్, అన్నపూర్ణేశ్వరినగర న్యాయవాది శ్రీరామ్ దారుణహత్యలను ప్రస్తావించారు. వృత్తిలో భాగంగా కక్షిదారుల తరఫున వాదనలు వినిపిస్తామని, దీంతో వ్యక్తిగత ద్వేషం పెంచుకుని దాడులకు పాల్పడడం పెరిగిందని తెలిపారు. దాడులకు గురైన తమకు న్యాయం లభించే వ్యవస్థ లేకుండా పోయిందని మండిపడ్డారు. ఇవి న్యాయవాదుల స్వాతంత్య్రం, భద్రతపైనే జరుగుతున్న దాడులని పేర్కొన్నారు. దౌర్జన్యపరులను కఠినంగా శిక్షించాలి, తమకు గట్టి భద్రత కల్పించాలని నినాదాలు చేశారు. సంఘం అధ్యక్షుడు వివేక్ సుబ్బారెడ్డి, కార్యదర్శి హెచ్‌వీ.ప్రవీణ్‌గౌడ సహా వందలాది మంది వకీళ్లు పాల్గొన్నారు.
● బెంగళూరులో.. ఇంటి బాడుగ చెల్లించాలని అడిగినందుకు వలస కూలీల చేతిలో న్యాయవాది కాల్చివేత
● ఆటో ఎక్కను, నడుచుకుంటూ వెళ్తాను అని చెప్పినందుకు వకీలును ఆటోతో గుద్ది చంపిన ఆటోడ్రైవరు,
● గౌరిబిదనూరులో సీనియర్ న్యాయవాదిపై ఆగంతకుని హత్యాయత్నం..
● ఇలాంటి దురాగతాలు పెరిగిపోవడంతో న్యాయవాదులు న్యాయం కోసం రోడ్డెక్కారు.
తమపై దాడులను అరికట్టాలని డిమాండ్
భద్రత కోసం సర్కారుకు వినతి
బెంగళూరుతో సహా రాష్ట్రంలో ఆందోళనలు
హోంమంత్రికి ఫిర్యాదు
బనశంకరి: బెంగళూరు న్యాయవాదుల సంఘం (ఏఏబీ) సభ్యులు హోంమంత్రి ప్రియాంక్ ఖర్గేను కలిసి లాయర్లకు భద్రత కల్పించాలని వినతిపత్రం అందజేశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. పోలీస్‌స్టేషన్లలో న్యాయవాదులకు కనీస గౌరవం ఇవ్వడం లేదు, కూర్చోవడానికి కుర్చీ కూడా ఇవ్వకుండా అహంకార ధోరణితో ప్రవర్తిస్తున్నారు, పోలీస్‌స్టేషన్లు చట్టవ్యతిరేక సమాంతర కోర్టులుగా మారుతున్నాయి, భూములు, ఆస్తులు వంటి సివిల్ కేసులను పోలీసులే తీర్చేయడం అధికమైంది అని వివరించారు. సివిల్ కేసుల్లో జోక్యం వద్దని సుప్రీంకోర్టు, డీజీపీ, పోలీస్ కమిషనర్ ఎన్నిసార్లు ఆదేశించినా సీఐ, ఎస్‌ఐ, ఏసీపీ స్థాయి అధికారులు ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు.
న్యాయవాదుల కొన్ని డిమాండ్లు
న్యాయవాదుల హత్యల కేసులో నిందితులను తక్షణం అరెస్ట్‌చేసి దర్యాప్తుచేసి శిక్షించాలి
న్యాయవాదుల సంరక్షణకు చట్టంలో బెయిల్ రహిత సెక్షన్లను చేర్చాలి. దాడి చేసే నిందితులకు కనీసం పదేళ్లు జైలు శిక్షపడాలి
ఠాణాల్లో వకీళ్ల పట్ల గౌరవంగా నడచుకోవాలి
ఠాణాల్లో సివిల్ కేసులను విచారించరాదు, ఉల్లంఘించే పోలీసులపై చర్యలు తీసుకోవాలి
ఈ డిమాండ్ల ప్రభుత్వం పరిష్కరించకపోతే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని న్యాయవాదులు తెలిపారు.


