పురిట్లోనే తల్లీ బిడ్డ కాటికి | - | Sakshi
Sakshi News home page

పురిట్లోనే తల్లీ బిడ్డ కాటికి

Nov 4 2026 3:14 AM | Updated on Nov 4 2026 3:14 AM

మైసూరు: పండంటి బిడ్డను ఒడిలోకి తీసుకుని లాలించాలని ఆశపడిన తల్లి ఆ బిడ్డను చూడకుండానే కన్నుమూస్తే, అమ్మ ఒడిలో సేదదీరాల్సిన శిశువు పురిట్లోనే ఊపిరొదిలింది. జిల్లాలోని కె.ఆర్‌.నగర పట్టణంలో ఉన్న మాతా శిశు ఆసుపత్రిలో బాలింత, శిశువు మృతి చెందడంతో కుటుంబీకులు భగ్గుమన్నారు. ధర్నా చేయగా ఉద్రిక్తత నెలకొంది.

ఒక్కరూ మిగల్లేదు

వివరాలు.. మళలి గ్రామానికి చెందిన మహేష్‌ భార్య సుస్మిత (26)కు నెలలు నిండడంతో కుటుంబీకులు ఆమెను సోమవారం సాయంత్రం మాతా శిశు ఆసుపత్రిలో చేర్చారు. మంగళవారం తెల్లవారుజామున ప్రసవం చేశారు, అయితే తల్లి, పుట్టిన శిశువు ఇద్దరూ మరణించారని ఆస్పత్రి వైద్య సిబ్బంది తెలిపారు. ఈ వార్త వ్యాపించడంతో, సుస్మిత కుటుంబ సభ్యులు, మళలి గ్రామస్థులు ఆస్పత్రిలో బైఠాయించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తల్లీ బిడ్డ మరణించారని ఆరోపించారు. కారణమైన వైద్యసిబ్బందిపై చర్య తీసుకోవాలని పట్టుబట్టారు. ఈ మరణాలతో సుస్మిత భర్త, ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా రోదించారు.

ఎమ్మెల్యే చర్చలు..

విషయం తెలిసి అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే డి రవిశంకర్‌ వారితో చర్చించి శాంతింపజేశారు. పోస్ట్‌మార్టం చేయకుండానే మృతదేహాలను ఇస్తామని, తగిన నష్టపరిహారం అందించడానికి అంగీకరించారు. సీఐ శివప్రకాష్‌ నాయకత్వంలో బందోబస్తు ఏర్పాటైంది. వైద్యశాఖ ఉన్నతాధికారి డా. మహమ్మద్‌ సిరాజ్‌ అహ్మద్‌ మాట్లాడుతూ వైద్యుల నిర్లక్ష్యం ఏమీ లేదని, ఉన్నతస్థాయిలో విచారణ చేస్తామని, లోపాలు ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మైసూరు జిల్లా కేఆర్‌ నగర సర్కారీ ఆస్పత్రిలో విషాదం

కుటుంబీకులు, గ్రామస్తుల ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement