చిక్కబళ్లాపురం: కన్నడ జానపద పాటలు, వివిధ ప్రాంతాల్లో పేరొందిన నృత్యరీతులను బాల బాలికలు అలవోకగా ప్రదర్శించి రక్తి కట్టించారు. చిక్కలో రెండురోజుల యువజనోత్సవం ఘనంగా ఆరంభమైంది. యువతరంలో దాగి ఉన్న ప్రతిభను గురించడానికి ప్రతిభాన్వేషణ కార్యక్రమాలు సహకరిస్తాయని జిల్లా కలెక్టర్ జి ప్రభు అన్నారు. మంగళవారం చిక్క నగరంలోని సర్ ఎంవి ఇండోర్ స్టేడియంలో క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా యువజనోత్సవాలకు నాంది పలికారు. కలెక్టరు ప్రసంగిస్తూ యువజనం ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనడం ద్వార ప్రతిభకు గుర్తింపు లభిస్తుందని, నాయకత్వ గుణాలు పెంపొందుతాయని కలెక్టరు తెలిపారు.
పిల్లలు చదువుతో పాటు పాటు కళలు, సాహిత్యం, ఆటల్లో పాల్గొంటూ పాటవానికి పదును పెట్టుకోవాలన్నారు. పోటీలలో గెలవడం ముఖ్యం కన్న పాల్గొనడం ముఖ్యమని తెలిపారు. వివిధ పాఠశాలల నుంచి వచ్చిన బాలలు బృందాలుగా జానపద నృత్యాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో అలరించారు. పెద్దసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
చిక్కబళ్లాపురంలో యువజనోత్సవాలు షురూ


