ఆన్‌లైన్‌లో చాముండి ఆలయ దర్శన సేవలు | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో చాముండి ఆలయ దర్శన సేవలు

Nov 4 2026 3:14 AM | Updated on Nov 4 2026 3:14 AM

మైసూరు: నగరంలోని చాముండి బెట్టలోని నాడశక్తి దేవత చాముండేశ్వరి దేవి దర్శనం, ఇతర సేవల కోసం ఈ నెల 1 నుంచి కొత్తగా వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. దర్శనం సహా వివిధ సేవల కోసం ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకోవచ్చని, ఆలయంలో ఇస్తున్న టికెట్‌ వ్యవస్థను నిలిపివేస్తున్నట్లు ఆలయ పాలక మండలి తెలిపింది. రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతోంది. కొందరు మాయగాళ్లు ఉదయాన్నే కొనుగోలు చేసిన అభిషేకం టికెట్‌ను సాయంత్రం వరకూ పలువురికి బదిలీ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. అంతేగాకుండా వివిధ సేవల టికెట్లు కొనేవారు పెరగడంతో, క్యూలో భక్తులకు దర్శనం ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో వెబ్‌సైట్‌లో సేవలకు నాంది పలికారు. అందులో దర్శన సమయం, సేవ, కొండ చరిత్ర, ఇతర సమాచారాన్ని పొందవచ్చు. వీఐపీల దర్శనానికి ప్రత్యేక స్లాట్‌ నిర్ణయించే ఆలోచన ఉంది. రోజుకు 200 టికెట్లను మాత్రమే ఇవ్వాలని, ప్రత్యేక సందర్భాల్లోనే టికెట్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించినట్లు తెలిపింది.

నకిలీ ఔషధాల కేసులో

ఈడీ సోదాలు

బనశంకరి: క్యాన్సర్‌ వంటి జబ్బులకు వాడే ఖరీదైన నకిలీ ఔషధాల తయారీ ముఠా కేసులో కేంద్ర ఈడీ అధికారులు మంగళవారం బెంగళూరులో 5 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. నిందితుడు వీరేశ్‌కుమార్‌ బ్యాంకు అకౌంట్‌లో ఉన్న సుమారు రూ.9 లక్షలు జప్తుచేశారు. ఫోన్లు, కంప్యూటర్లు, ఫైళ్లు తదితరాలను స్వాధీనం చేసుకున్నామని ఈడీ అధికారులు తెలిపారు. జావిసెప్టా, ఎంబ్లావియో, ఫైజర్‌ పేర్లతో కొత్త సీసాల్లో ప్యాక్‌ చేసిన నకిలీ ఔషధాలను డీఎం ఫార్మాస్యూటికల్స్‌ ద్వారా కృపా హెల్త్‌కేర్‌ సంస్థకు సరఫరా చేసేవారని తెలిపారు. కృపా హెల్త్‌కేర్‌ నిర్వాహకులు ఈ నకిలీ ఔషధాలను మెడికల్‌ షాపులకు, ఆస్పత్రులకు విక్రయించేవారని ఈడీ తెలిపింది.

నూర్పిడి యంత్రం ఢీ,

ఇద్దరు దుర్మరణం

మైసూరు: రాగి నూర్పిడి వాహనం ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందిన సంఘటన జిల్లాలోని హుణసూరు తాలూకా కిరంగూరు రోడ్డులో జరిగింది. హుణసూరు తాలూకా నాగరహొళె అడవి భీమనకట్టె పెంపుడు ఏనుగుల శిబిరం ఉద్యోగి కుశాల్‌ కుమారుడు ప్రవీణ్‌ (26), మాస్తిగుడి కూసయ్య కుమారుడు (23) మృతులు. ఇద్దరూ కలిసి బైకులో కిరంగూరు–హనగోడు మార్గంలో మాస్తిగుడికి బయలుదేరారు. కిరంగూరు వైపు నుంచి అతివేగంగా వచ్చిన తమిళనాడుకు చెందిన పెద్ద నూర్పిడి యంత్రపు వాహనం ఢీకొనడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడి స్థలంలోనే మరణించారు.

రక్తదానం ఆవశ్యకం

మండ్య: ఆరోగ్యంగా ఉన్నవారు రక్తదానం చేయడం చాలా ముఖ్యం అని అరకెరె ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ మంజునాథ్‌ అన్నారు. మండ్య జిల్లాలోని శ్రీరంగపట్నం తాలూకాలోని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సహా పలు సంస్థల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, ప్రసవాలు వంటి అత్యవసర పరిస్థితులలో రక్తం అవసరం ఎక్కువగా ఉంటుంది. రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేము. అందువల్ల, ఆరోగ్యంగా ఉన్నవారు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం చాలా ముఖ్యం అని వైద్యనిపుణులు తెలిపారు. ఈ సందర్భంగా 84 మంది యువకులు రక్తదానం చేశారు.

పులి పంజా.. రైతుకు గాయాలు

మైసూరు: పులి దాడి చేయడంతో ఓ రైతు గాయపడిన ఘటన జిల్లాలోని నంజనగూడు తాలూకా ఆకళ గ్రామంలో జరిగింది. రైతు పరమేశ్‌ పొలంలో పని చేస్తుండగా పొదల్లో ఉన్న పులి మీద పడి దాడి చేయడంతో గాయపడ్డారు. అతడు గట్టిగా కేకలు వేయడంతో పులి వదిలేసి పారిపోయింది. స్థానికులు రైతును మైసూరులోని జేఎస్‌ఎస్‌ ఆస్పత్రికి తరలించారు. అటవీ అధికారి నితిన్‌ కుమార్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బోనులు పెట్టి పులిని పట్టుకుంటామని రైతులకు భరోసా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement