రాయచూరు రూరల్: పంచ గ్యారెంటీల లబ్ధి అర్హులైన లబ్ధిదారులకే చేకూరేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచ గ్యారెంటీ కమిటీ ఉపాధ్యక్షుడు టి.పరమేశ్వర నాయక్ పేర్కొన్నారు. మంగళవారం జలనిర్మల సభాంగణంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దుర్వినియోగానికి పాల్పడిన రూ.15 కోట్లు తిరిగి వసూలు చేశారని, మిగిలిన రూ.100 కోట్ల విషయంలో బ్యాంక్ అధికారులతో చర్చిస్తామన్నారు. మరణించిన వారి ఖాతాలో పడిన డబ్బులు వసూళ్లలో తర్జన భర్జనలు జరుగుతున్నట్లు తెలిపారు. అన్న భాగ్య పథకంలో నియమాలను ఉల్లంఘించిన 14 మంది డీలర్లు, 6,847 కార్డులను రద్దు చేశామని, 9,631 కేజీల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. అన్నభాగ్య పథకంలో డీబీటీ ద్వారా రూ.508.72 కోట్లు, శక్తి పథకంలో రూ.608 కోట్లను విడుదల చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పంచ గ్యారెంటీలను కొనసాగిస్తామన్నారు. సమావేశంలో జిల్లాధ్యక్షుడు పామయ్య మురారి, సీఈఓ ఈశ్వర్ కుమార్ తదితరులున్నారు.


