బళ్లారిఅర్బన్: ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా విజనరీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని మిల్లర్‌పేట నగర ఆరోగ్య కేంద్రంలో ఉచిత నేత్ర వైద్య పరీక్ష, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ట్రస్ట్, బీఎంసీఆర్‌సీ, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని వైద్యాధికారులు డాక్టర్ వీరేంద్ర, డాక్టర్ ఇంద్రాణి, డాక్టర్ పరసప్ప, డాక్టర్ శోభ, డాక్టర్ జైనుల్లా తదితరులు ప్రారంభించారు. అనంతరం ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, దృష్టి సమస్యలతో బాధపడుతున్న వారికి నిపుణులైన వైద్యులు తగిన వైద్య సలహాలు, చికిత్స అందించారు.
గంజాయి విక్రేతల అరెస్ట్
హుబ్లీ: పాత హుబ్లీ, ధార్వాడల్లో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ధార్వాడ టోల్‌నాకా వద్ద 175 గ్రాముల గంజాయి, 2 మొబైల్ ఫోన్లు, రూ.3,010 నగదుతో పాటు ఇద్దరిని సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను వాసీం (25), అజీజ్ మహమ్మద్ (26) గా గుర్తించారు. ఘటనపై విద్యాగిరి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మరో కేసులో పాత హుబ్లీ గుడిహాళ రోడ్డు పక్కన 316 గ్రాముల గంజాయిని విక్రయిస్తున్న నలుగురిని పాత హుబ్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను మహమ్మద్ గౌస్(24), బాబాజాన్(27), జేమ్స్ (21) మహమ్మద్ ముల్లా (19)గా గుర్తించారు. అర్మాన్ అనే నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
దళితులకు టికెట్లు కల్పించాలి
రాయచూరు రూరల్: జిల్లాలో దళితులకు రాజకీయంగా రిజర్వేషన్ల ప్రకారం టికెట్లు కల్పించాలని మాదిగ సేవా సమితి సంచాలకుడు రవీంద్ర జాలదార్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా పంచాయతీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో దళితులకు రిజర్వేషన్ల కోటా ప్రకారం టికెట్లను కేటాయించాలన్నారు. అనంతరం అదనపు జిల్లాధికారి శివమల్లప్పకు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో నరసప్ప, నాగరాజ్, సుభాష్, భీమయ్యలున్నారు.
దురాచారంపై సమీక్ష
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకా నాగరాళలో హోటల్‌లో ఎస్సీ కులానికి చెందిన వ్యక్తికి జగ్గుతో దోసిలిలోకి నీరు పోసి తాగించిన వైనం వైరల్ కావడంతో అధికారులు గ్రామాన్ని సందర్శించారు. సోమవారం జిల్లాధికారి పూవిత, జడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, లింగసూగూరు డీఎస్పీ సులేమాన్ తిడిగోళ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శాంతి సమావేశం నిర్వహించారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, హోటల్ యజమానిపై కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు.
రైతులకు జిల్లాధికారిణి అవమానం
రాయచూరు రూరల్: జిల్లాలో నీటి సమస్యలపై స్పందించాలని అడగడానికి వెళ్లిన రైతులను జిల్లాధికారిణి పూవిత అవమానించారని రైతు సంఘం నేత అనిత ఆరోపించారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో తుంగభద్ర కృష్ణా నదులున్నా ప్రజలకు నీరు అందించడం లేదన్నారు. దీనిపై అడిగేందుకు వెళ్లిన రైతులను బయటికి వెళ్లమని చెప్పి అవమానించారన్నారు. రైతులు తప్పు చేసి ఉంటే కేసు పెట్టాలన్నారు. 48 గంటల్లో చేసిన తప్పిదంపై వివరణ ఇవ్వకపోతే అత్తనూరులో నిరాహార దీక్ష చేపడతామని తెలిపారు.
కనీస వేతనాలివ్వండి
రాయచూరు రూరల్: సాంఘీక సంక్షేమ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఎస్టీ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అందించాలని సాంఘీక సంక్షేమ శాఖ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం సాంఘీక సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు బసవలింగప్ప మాట్లాడారు. రాష్ట్ర సర్కార్ ఆధీనంలో విధులు నిర్వహించే కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అందించేలా సర్కార్ చర్యలు చేపట్టి వారికి సక్రమంగా సౌకర్యాలు అందించాలని కోరుతూ అధికారికి వినతిపత్రం సమర్పించారు.


